
చెన్నై: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆగస్టు 20 తర్వాత అన్ని ప్రాంఛైజీలు యూఏఈకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. యూఏఈ వెళ్లే ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ ఆటగాళ్ల కోసం ఒకవారం పాటు ఫిట్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం నుంచి సైతం అనుమతులు లభించాయని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆగస్టు 15 నుంచి చెన్నై చెపాక్ స్టేడియంలో నిర్వహించే ఫిట్‌నెస్ క్యాంప్‌నకు దూరమౌతున్నాడని సీఈవో విశ్వనాథన్ తెలిపారు. వ్యక్తిగత కారణాల రిత్యా జడేజా క్యాంప్‌కు హాజరకాలేకపోతున్నాడని విశ్వనాథన్ వెల్లడించారు. ఆగస్టు 21న దుబాయ్‌కు బయలు దేరే ముందు జడ్డూ జట్టుతో కలుస్తాడని ఆయన స్పష్టం చేశారు. తమ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, అసిస్టెంట్ కోచ్ మైఖేల్ హస్సీ కూడా 22న దుబాయ్‌లో జట్టులో చేరుతారని చెన్నై సీఈవో చెప్పారు.
కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలుగా ఆటగాళ్లు సరైన ఫిట్‌నెస్ లేక ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ టోర్నీపై స్పష్టత రావడంతో చెన్నై ఆటగాళ్లకు ఈనెల 15 నుంచి 20 మధ్య ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు మార్చిలో కూడా ఆ జట్టు అందరి కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు కెప్టెన్ ఎమ్మెస్ ధోనీతో సహా సురేశ్ రైనా, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్ పాల్గొన్నారు. ఇప్పుడు నిర్వహించే శిబిరంకు కూడా అందరూ రానున్నారు.
చెన్నై ఆటగాళ్లు, టీమ్ సపోర్ట్ స్టాఫ్ ఫ్యామిలీస్‌కి యూఏఈ వచ్చేందుకు అనుమతి లేదని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ... 'లీగ్ మొదటి భాగంలో ఆటగాళ్లు, టీమ్ సపోర్ట్ స్టాఫ్ ఫ్యామిలీస్‌కి అనుమతి లేదు. జట్టుతో పాటు ఫ్యామిలీస్ యూఏఈకి రావడం లేదు. యూఏఈ పరిస్థితులను బట్టి రెండో భాగంలో ఫ్యామిలీస్‌ని అనుమతించాలా? వద్దా? అని ఆనిర్ణయం తీసుకుంటాం' అని తెలిపారు. గతేడాది చెన్నై కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి టైటిల్ చేజార్చుకుంది. ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే.