
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్, బౌలర్లకు ఇచ్చే ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లకు తన దృష్టిలో ఏమాత్రం విలువ లేదని ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఆటతో జట్టును గెలిపించడమే అన్నింటికంటే ముఖ్యమని యాష్ అభిప్రాయపడ్డాడు. జట్టు గెలువకుంటే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు కంటి తుడుపు లాంటివే అని పేర్కొన్నాడు. గతేడాది ఐపీఎల్‌లో అశ్విన్ కింగ్స్ పంజాబ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు.
తాజాగా రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ ఏడాది పర్పుల్ క్యాప్ అందుకుంటారా అని ఓ అభిమాని అడగ్గా... 'జట్టు గెలవనంత వరకు ఇలాంటి వాటితో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ అంకెల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు ఉంటే కంటితుడుపులాంటివి మాత్రమే. జట్టు విజయంలో మన పాత్రను సమర్థంగా పోషించామా లేదా అన్నదే ముఖ్యం' అని అశ్విన్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 144 మ్యాచ్‌లు ఆడిన ఆర్ అశ్విన్.. 6.81 ఎకానమితో 131 వికెట్లు తీశాడు. గత ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అశ్విన్ 35 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఆ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 162 పరుగులు చేయగా.. మరో రెండు బంతులు ఉండగానే ముంబై విజయాన్ని అందుకుంది.
ఆర్ అశ్విన్ గతేడాది మన్కడింగ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను రనౌట్ చేశాడు. మన్కడింగ్ తెరపైకి వచ్చినప్పటి నుంచి అశ్విన్ బాగా పాపులర్ అయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు అశ్విన్ అదిరిపోయే ఝలక్ ఇచ్చాడు. అశ్విన్ బంతి విసరక ముందే ఫించ్.. క్రీజు వదిలి చాలా దూరం వెళ్లిపోయాడు. దాంతో అతడి వైపు కోపంగా చూసిన అశ్విన్.. ఫస్ట్ వార్నింగ్ అనేలా సైగ చేసి ఊరుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాత అశ్విన్ ఓ పోస్ట్ కూడా చేశాడు. 'ఐపీఎల్ 2020లో ఫస్ట్, ఫైనల్ వార్నింగ్ ఇదే. ఆ తర్వాత నన్ను నిందించొద్దు' అని ట్వీట్ చేశాడు.