
దుబాయ్: యూఏఈ వేదికగా మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సందడి మొదలుకానుంది. సెప్టెంబర్ 19న జరిగే లీగ్ ఆరంభ మ్యాచులో రన్నరప్ చెన్నై సూపర్‌కింగ్స్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో అభిమానులను ఆకట్టుకునేందుకు అన్ని జట్లు సిద్ధమైపోయాయి. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే ఆయా జట్లు, ఆటగాళ్ల అభిమానులు ఐపీఎల్ విశేషాలు, గత సీజన్ తాలూకు జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ మీమ్స్, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై సెటైర్ వేశాడు.
ఐపీఎల్ 12వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా ఆడిన రవిచంద్రన్ అశ్విన్.. ఓ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని మన్కడింగ్ చేశాడు. అశ్విన్ బంతి విసరక ముందే.. బట్లర్ క్రీజు దాటి చాలా దూరం వెళ్లిపోయాడు. ఇది గమనించిన అశ్విన్ బౌలింగ్‌ని నిలిపివేసి.. బెయిల్స్‌ని పడగొట్టాడు. ఔట్ కోసం అప్పీల్ చేయగా.. థర్డ్ అంపైర్ ఔటిచ్చేశాడు. దాంతో అశ్విన్ క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ ఆ సీజన్ మొత్తం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే తాను మాత్రం క్రికెట్ రూల్స్ ప్రకారమే ఆడానని బదులిచ్చాడు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌ను హెచ్చరించాడు. రషీద్ క్రీజుదాటి బయటకు వెళ్లినా.. స్టార్క్ బంతి వేయడం ఆపేసి ఎక్కడికి వచ్చావో చూసావా? అని లైన్‌ను చూపించాడు. మన్కడింగ్ చేయకుండా రషీద్‌ను హెచ్చరించాడు. దానికి సంబందించిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ఓ నెటిజన్ అశ్విన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'అశ్విన్.. ఇది చూసి కొంచెం నేర్చుకో. ఇలాగే నువ్వు ఆడతావు కదా' అని సెటైర్ వేశాడు. ఇందుకు స్పందించిన అశ్విన్.. తాను బాగానే ఆడతానని, ఇందుకోసం కాస్త వేచి చూడాలని, తనదైన రోజు ఇందుకు బదులిస్తానంటూ కౌంటర్ ఇచ్చాడు.
క్రికెట్ నియమావళి 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ పలువురు ఆర్ అశ్విన్‌పై విమర్శలు గుప్పించారు. క్రీడా స్ఫూర్తికి ఇది విరుద్దమంటూ దుమ్మెత్తిపోశారు. అయితే తాను మాత్రం క్రికెట్ రూల్స్ ప్రకారమే ఆడానని అశ్విన్ మొదటినుంచి చెప్పుతూ వస్తున్నాడు. గత ఏడాది పంజాబ్ తరఫున ఆడిన ఆర్ అశ్విన్.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడబోతున్నాడు. దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో అశ్విన్‌ని మన్కడింగ్ చేయనివ్వనని ఢిల్లీ చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ మొదట అన్నాడు. ఆ తర్వాత అశ్విన్‌తో మాట్లాడక తన అభిప్రాయం మార్చుకున్నాడు. బంతిని బౌలర్ విసరక ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాట్స్‌మెన్ 2-3 అడుగులు మందుకు వెళ్లడం ఛీటింగ్ అని, అలా నిబంధనలు అతిక్రమించే బ్యాట్స్‌మెన్‌కి రన్ పెనాల్టీ విధించాలని ప్రతిపాదించాడు.