
రాజస్థాన్ మీద బౌలింగ్ దాడి
ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా యుఏఈలోని దుబాయ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ అత్యుత్తమ బౌలింగ్ ప్రతిభను ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్.. 161 పరుగులు మాత్రమే చేయగలిగినప్పటికీ.. దాన్ని కాపాడుకోగలిగింది. ప్రత్యర్థి జట్టును 148 పరుగులకే పరిమితం చేసింది. 13 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. పేస్, స్పిన్ బౌలింగ్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్లు ఏ మాత్రం నిలవలేకపోయారు. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు.
బట్లర్‌ను బలి తీసుకున్న ఫాస్టెస్ట్ బాల్..
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాట్స్‌మెన్లను ఢిల్లీ బౌలర్లు బెంబేలెత్తించారు. ఓపెనర్లు బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్ దూకుడుగా ఇన్నింగ్‌ను ప్రారంభించారు. మూడు ఓవర్లలో 37 పరుగులు సాధించారు. తొమ్మిది బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో 22 పరుగులు చేసి దూకుడు మీదున్న బట్లర్‌ను నోర్జె అవుట్ చేసిన తీరు వీక్షకులను కట్టి పడేసింది. నోరెళ్ల బెట్టేలా చేసింది.
మూడో ఓవర్‌ను వేసిన నోర్జె.. నిప్పులు కురిపించే బంతులను సంధించాడు. మూడో ఓవర్ అయిదో బంతిని 156.2 కిలోమీటర్ల స్పీడ్‌తో బంతిని విసిరాడు. ఐపీఎల్ సీజన్లలో ఫాస్టెస్ట్ బాల్‌గా రికార్డులకు ఎక్కింది. ఆ బంతిని ఫోర్‌కు తరలించాడు బట్లర్. ఆరో బంతిని కూడా అదే వేగంతో విసిరాడు. నోర్జె చేతి నుంచి 155.1 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌లా దూసుకొచ్చిన క్విక్కర్‌ను బట్లర్ ఎదుర్కొనలేకపోయాడు. రిథమ్ తప్పాడు. అదే వేగంతో వికెట్లను గాల్లోకి లేపిందా బంతి.
నోర్జెను ఆకాశానికెత్తేస్తోన్న మాజీ పేసర్లు..
155 కిలోమీటర్లకు పైగా వేగంతో వరుసగా రెండు బంతులను విసరడం పట్ల మాజీ క్రికెటర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ.. నోర్జెను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో బెస్ట్ బౌలింగ్‌గా, ఫాస్టెస్ట్ బాల్‌గా కనిపిస్తోందని బ్రెట్ లీ చెప్పాడు. ఒకేరకమైన వేగంతో వరుసగా బంతులను సంధించడం సాధారణ విషయం కాదని చెప్పాడు. నిప్పుకు నిప్సే తోడైందంటూ రవిశాస్త్రి కామెంట్స్ చేశాడు. నిప్పులు కురిపించే బంతి అనే పదానికి సరైన నిర్వచనం దొరికిందని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
