పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్ పడుతుందా? రాజస్థాన్ రాయల్స్‌కు లైఫ్ అండ్ డెత్ గేమ్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో మరో ఆసక్తికర మ్యాచ్ ఇంకాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ ఇది. ఏ జట్టు గెలిచినా మరో జట్టుకు ప్లేఆఫ్ అవకాశాలకు గండి కొట్టే మ్యాచ్ ఇది. పంజాబ్ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యాన్ని వహిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు స్టీవ్ స్మిత్ నాయకత్వాన్ని వహిస్తున్నాడు.

పంజాబ్‌పై రాజస్థాన్‌దే డామినేషన్

పంజాబ్‌పై రాజస్థాన్‌దే డామినేషన్

ఇప్పటికైతే.. ఈ రెండు జట్లకూ ప్లేఆఫ్ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడే జట్టు ఆ ఛాన్స్‌ను కోల్పోతుంది. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7:30 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ రెండు జట్ల బలాబలాలను బేరీజు వేసుకుని చూస్తే.. సమతూకంగా ఉంటున్నాయి. చివరి అయిదు మ్యాచ్‌ల ఆధారంగా అంచనా వస్తే.. విజయావకాశాలు మాత్రం కింగ్స్ పంజాబ్‌కే అధికంగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ మీద ట్రాక్ రికార్డు మాత్రం బెదరగొట్టేలా ఉంది.

223 పరుగుల భారీ స్కోర్‌ను ఛేదించి..

223 పరుగుల భారీ స్కోర్‌ను ఛేదించి..

ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్‌ను సాధించినప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన చరిత్ర పంజాబ్‌కు ఉంది. ఈ సీజన్‌లో ఆడిన మూడో మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగా.. రాజస్థాన్ రాయల్స్ దాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. ఇంకో మూడు బంతులు మిగిలి ఉండగానే 226 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు రాయల్స్ బ్యాట్స్‌మెన్స్. అదే పరిస్థితి ఇక్కడా పునరావృతం అవుతుందా? లేదా? అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.

వరుస విజయాలతో అప్రతిహతంగా..

వరుస విజయాలతో అప్రతిహతంగా..

ఈ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా ఆడిన చివరి అయిదు మ్యాచ్‌లనూ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గెలుచుకుంది. వరుసగా అయిదు మ్యాచ్‌లను గెలవడం అదో రికార్డు. టోర్నమెంట్ ఆరంభంలో ఆడిన రెండో మ్యాచ్ మినహా వరుసగా అయిదు మ్యాచ్‌లను ఓడిపోయింది. ఆ తరువాత క్రిస్ గేల్‌ను జట్టులోకి తీసుకుంది. ఆ తరువాత దాని కథే మారిపోయింది. వరుస విజయాలను అందుకుంటోంది కింగ్స్ ఎలెవెన్. అయిదు మ్యాచుల్లో విజయం సాధించింది. ఐపీఎల్-2020 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది.

రాజస్థాన్‌కు లైఫ్ అండ్ డెత్..

రాజస్థాన్‌కు లైఫ్ అండ్ డెత్..

రాజస్థాన్ పరిస్థితేమీ ఆశాజనకంగా లేదు. ఆడిన 12 మ్యాచుల్లో అయిదింట్లోనే విజయం సాధించింది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం ఉన్నవి 10 పాయింట్లే. ప్లేఆఫ్‌కు చేరాలంటే.. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు ఆదివారం సాయంత్రం కోల్‌కత నైట్ రైడర్స్‌పైనా విజయం సాధించాల్సి ఉంటుంది.. భారీ తేడాతో. ఈ రెండూ జరిగితే మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌కు వెళ్లడం ఖాయమౌతుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటిదారి పట్టాల్సిందే.

పంజాబ్ జైత్రయాత్ర కొనసాగుతుందా?

పంజాబ్ జైత్రయాత్ర కొనసాగుతుందా?

పంజాబ్ పరిస్థితీ దాదాపు అంతే. రాజస్థాన్ రాయల్స్‌తో పాటు ఆదివారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టాల్సింది పంజాబ్. ఇప్పటికే 12 పాయింట్ల ఉన్నందున.. రెండూ గెలిస్తే ఎలాంటి ఈక్వేషన్లతో పని లేకుండా నేరుగా ప్లేఆఫ్ చేరుకుంటుంది. ఈ రెండూ ఓడిపోతే.. 12 పాయింట్ల వద్దే దాని జైత్రయాత్రకు అడ్డుకట్ట పడుతుంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి హిట్టర్లు ఉండటం.. వరుస విజయాలను సాధించడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనేలా కనిపిస్తోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, October 30, 2020, 15:07 [IST]
Other articles published on Oct 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X