
ఐపీఎల్ వాయిదా పడడం కలిసొచ్చింది:
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దీపక్ చహర్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి. ఐపీఎల్ వాయిదా పడడం ఎలా ఉంది అని చెన్నై జట్టు ప్రశ్నించగా... 'షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ ఆరంభమైతే కొన్ని మ్యాచ్‌లు దూరమయ్యేవాడిని. వాయిదా పడటం నాకు కలిసొచ్చింది. గాయం నుంచి కోలుకుని మళ్లీ బౌలింగ్ చేయడానికి ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి నా దృష్టి అంతా ఫిట్‌నెస్‌పై ఉంది. ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడంలో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా' అని చహర్ బదులిచ్చాడు.

దేశమంతా క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటుది:
'మహమ్మారి కరోనా కారణంగా దేశమంతా ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటుది. వ్యాపారులు, ఉద్యోగులు, దినసరి కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. దినసరి కూలీల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటాం అని ఆశిస్తున్నా. అందరం కరోనాపై కలిసి పోరాడదాం. నిత్యం చేతులు శుభ్రం చేసుకుంటూ, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉందాం' అని దీపక్ చహర్ ప్రజలకు సూచించాడు.

వెన్ను గాయంతో దూరం:
గత ఏడాది డిసెంబర్‌లో వెస్టిండీస్ జరిగిన సిరీస్‌లో దీపక్ చహర్ గాయడ్డాడు. దీంతో అప్పటినుండి జట్టుకు దూరమయ్యాడు. వెన్ను గాయంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో గతవారం వరకు పునరావాసం తీసుకున్నాడు. ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 మ్యాచ్‌లాడిన చహర్.. 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఇదే అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్.

10 టీ20లు.. 17 వికెట్లు:
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పర్యవేక్షణలో చెన్నైకి ఆడుతూ రాటుదేలిన చహర్.. అద్భుత బౌలింగ్‌తో బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో భారత జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాన్ని అందుకున్నాడు. కొత్త బంతితో.. డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణిస్తూ ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. మొత్తం 10 అంతర్జాతీయ టీ20లు ఆడిన దీపక్.. 7 ఎకనామితో 17 వికెట్లు పడగొట్టాడు.

టీ20లో హ్యాట్రిక్:
గతేడాది నాగ్‌పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో దీపక్ చహర్ (6/7) హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు తీయడంతో భారత్ 30 పరుగుల తేడాతో బంగ్లాను మట్టికరిపించింది. చహర్ (3.2-7-6) అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేసాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చహర్ రికార్డులోకి ఎక్కాడు. శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్, భారత స్పిన్నర్ యుజువేంద్ర చహల్ మాత్రమే టీ20ల్లో ఆరు వికెట్లు తీశారు. మెండిస్, చహల్ స్పిన్నర్లు కాగా.. చహర్ పేస్ బౌలర్ కావడం విశేషం


Click it and Unblock the Notifications












