లాక్‌డౌన్ పొడగింపు.. ఐపీఎల్ 2020 మళ్లీ వాయిదా!!?

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన 20 లక్షల మంది పడ్డారు. అందులో 4.5 లక్షల మంది కోలుకోగా.. 1.2 లక్షల మంది మృతిచెందారు. అగ్రరాజ్యం అమెరికాలో 5.9 లక్షల కేసులు నమోదు కాగా.. దాదాపు 24 వేల మంది మరణించారు. భారత దేశంలో వైరస్ వ్యాప్తి 'పీక్' దశకు చేరనేలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం నాటికి వైరస్ బాధితుల సంఖ్య 10 వేలు దాటగా.. అందులో వెయ్యికి పైగా కోలుకున్నారు. ఇక మరణాల సంఖ్య 350గా ఉంది. అయితే కరోనాను మరింత కట్టడి చేసేందుకు ముందస్తు జాగ్రత్తగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు.

లాక్‌డౌన్ పొడగింపు
మంగళవారం ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడగించడంతో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 జరుగుతుందా లేదా అనే సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ నిరవధిక వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో చెప్పారని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. ఈ నెల 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే.

మే 3 తర్వాతే
'ఐపీఎల్ 2020 భవితవ్యంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. కరోనా వైరస్ సంక్షోభానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఐపీఎల్ సమస్యకు పరిష్కారం కోసం భాగస్వాములందరితో బోర్డు చర్చిస్తుంది. మే 3 తర్వాత మాత్రమే పరిస్థితిని బీసీసీఐ సమీక్షిస్తుంది' అని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. ఐపీఎల్ రద్దు చేస్తే రూ.3వేల కోట్ల దాకా నష్టం వస్తుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.

టోర్నీ వాయిదా లేదా రద్దు
వాస్తవానికి సోమవారం బీసీసీఐ, ప్రాంఛైజీల సమావేశం జరగాలి. ఒకవేళ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే.. ఐపీఎల్ టోర్నీ నిర్వహించడంపై ప్రణాళికలు చేయాలనుకున్నారు. కానీ.. ప్రధాని మోదీ ప్రసంగం మంగళవారం ఉదయం ఉంటుందని సోమవారం తెలిసింది. వైరస్ కట్టడి కాకపోవడంతో.. లాక్‌డౌన్‌ను కొనసాగించే యోచనలో కేంద్రం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో బీసీసీఐ, ప్రాంచైజీల సమావేశం రద్దయింది. ఈ రోజు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. దీంతో అధికారిక ప్రకటన రాకున్నా.. ఐపీఎల్ 2020 మళ్లీ వాయిదా పడడం మాత్రం ఖాయం. టోర్నీని రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టోర్నీని వాయిదా లేదా రద్దు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం బీసీసీఐ ముందు లేదు.

ఆగస్టు-సెప్టెంబరు విండో
పీఎల్ 2020 సీజన్ రద్దు కారణంగా బీసీసీఐ సుమారు రూ. 3 వేల కోట్లు నష్టపోనుందని ఓ అంచనా. మరోవైపు టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు కూడా కోట్లలో నష్టపోనున్నాయి. దీంతో టోర్నీని రద్దు చేయకుండా నిర్వహించేందుకు ఉన్న అనువైన మార్గాలన్నింటినీ బీసీసీఐ అన్వేషించింది. ఈ క్రమంలో ఆగస్టు-సెప్టెంబరులో మధ్యకాలంలో ఐపీఎల్‌ని నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఇక అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించే దిశగానూ బీసీసీఐ చర్చలు జరిపింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications