గేల్ అడుగు పెట్టిన వేళా విశేషం: చివరి బంతికి సిక్స్: ఆ వీరులు వీరే: మరో సీట్ ఎడ్జ్ మ్యాచ్

షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో మరో సీట్ ఎడ్జ్ మ్యాచ్ సాక్షాత్కరించింది. విజయం కోసం ముఖం వాచిపోయిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్.. మరో గెలుపు రుచి చూసింది. విజయాల కరవు తీర్చుకుంది. ఈ సీజన్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లో మినహా.. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ దారుణ పరాజయాలను చవి చూసిందా జట్టు. కరేబియన్ ఆల్‌రౌండర్ అడుగు పెట్టిన వేళా విశేషం ఏమో గానీ మొత్తానికి మరో మ్యాచ్‌లో విన్నర్‌గా నిలిచింది. తన ఖాతాలో మరో రెండు పాయింట్లను జమ చేసుకుంది.

కేఎల్.. క్రిస్ గేల్ హాఫ్ సెంచరీలతో..
షార్జా స్టేడియంలో గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకున్న తీరు.. ఆ జట్టు పోరాట పటిమన చాటింది. చివరి బంతి వరకూ పోరాడటం అంటే ఏమిటో మరోసారి రుజువు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ ఉంచిన 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కడదాకా పోరాడింది కేఎల్ రాహుల్ టీమ్. ఇన్నింగ్ చివరి బంతికి సిక్స్‌ను సాధించి.. విజయాన్ని అందుకుంది. 177 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది.

తొలి మ్యాచ్‌లోనే..
బెంగళూరు ఉంచిన భారీ లక్ష్యాన్ని అందుకోవడంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ నెమ్మదిగా ఆడినా..వికెట్లను కాపాడుకోగలిగింది. అదే ఆ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. 177 పరుగులను ఛేదించే ప్రయత్నంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్, జట్టు కేప్టెన్ కేఎల్ రాహుల్ 49 బంతుల్లో అయిదు సిక్సులు, ఒక ఫోర్‌తో 61 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇక క్రిస్ గేల్.. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో అదరగొట్టాడు. 45 బంతుల్లో అయిదు సిక్సులు ఒక ఫోర్‌తో 53 పరుగులు చేశాడు.

చివరి బంతికి హైడ్రామా..
ఈ మ్యాచ్ మొత్తానికీ పంజాబ్ ఇన్నింగ్ చివరి ఓవర్ హైలైట్. చివరి ఓవర్‌లో రెండు పరుగులు సాధించడానికి బ్యాట్స్‌మెన్లు ఇబ్బంది పడ్డారు. యజువేంద్ర చాహల్ వేసిన ఆ ఓవర్‌లో తొలి రెండు బంతులకు పరుగులేవీ రాలేదు. మూడో బంతికి గేల్ ఓ సింగిల్ తీశాడు. దీనితో స్కోర్ సమం అయింది. నాలుగో బంతిని ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ డాట్ బాల్ ఆడాడు. అయిదో బంతికి కేెఎల్ రాహుల్ లేని పరుగు కోసం ప్రయత్నించాడంతో క్రిస్ గేల్ రనౌట్ కావాల్సి వచ్చింది. గేల్ స్థానంలో క్రీజులోకి దిగిన నికొలస్ పూరన్.. చివరి బంతిని సిక్స్‌గా మలిచాడు. చాహల్ వేసిన లో ఫుల్‌టాస్‌ను లాంగ్ ఆన్ మీదుగా ఫెన్సింగ్ దాటించేశాడు.

చివరి బంతికి సిక్స్ కొట్టిన వీరులు వీరే..
చివరి బంతిని సిక్స్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించిన వీరుల జాబితాలో నికొలస్ పూరన్ చేరాడు. ఈ లిస్ట్‌లో అతని నంబర్.. నైన్. అతని కంటే ముందు ఎనిమిది మంది చివరి బంతికి సిక్స్ బాదారు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ కమ్ కేప్టెన్ రోహిత్ శర్మతో ఈ సంప్రదాయం ఆరంభమైంది. 2009లో కోల్‌కత నైట్ రైడర్స్‌పై ఆడిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ బోణీ చేశాడు. చివరిబంతిని సిక్స్‌గా కొట్టి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. 2011లో మళ్లీ రోహిత్ శర్మే.. పుణే వారియర్స్‌పై ఈ ఘనత సాధించాడు. అదే సీజన్‌లో అంబటి రాయుడు, 2012లో రోహిత్ శర్మ, అదే ఏడాది సౌరభ్ తివారీ, డ్వేన్ బ్రావో, 2016లో మహేంద్ర సింగ్ ధోనీ, 2019లో మిఛెల్ సాంట్నర్ చివరి బంతికి సిక్స్ కొట్టారు. అదే జాబితాలో పూరన్ చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications