KKR vs CSK: ఎంఎస్ ధోనీ గొప్ప ఫినిషర్.. ఐపీఎల్ 2020లో మాత్రం: లారా

దుబాయ్: క్రికెట్ ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ఎంతో ప్రశాంతంగా జట్టును విజయతీరాలకు చేర్చడంలో ధోనీ దిట్ట. ఓ ప్లాన్ ప్రకారం మ్యాచ్‌లను ముగిస్తుంటాడు. ఇక చివరి ఓవర్లలో మహీ క్రీజులో ఉన్నాడంటే.. విజయం మనదే అనే ధీమా అభిమానులది. విజయానికి 15 పరుగులు చేయాల్సి ఉంటే.. ఒత్తిడి ధోనీ మీద కాదు, బౌలర్ మీద ఉంటుంది. ఇలా ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో ఈ మార్క్ మహీలో కనిపించడం లేదు. ఫినిషర్ పాత్ర పోషించడం లేదు.

సింగిల్స్‌కే పరిమితం
ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఫినిషర్ పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమవుతూన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో చెన్నై విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. మహీ భారీ షాట్లు ఆడకుండా సింగిల్స్‌కే పరిమితం అయ్యాడు. ఒక్కోసారి ఆ సింగిల్ తీయడానికి కూడా ఇబ్బందిపడ్డాడు. ఒకానొక సందర్భంలో ఇక పరిగెత్తడం తన వల్ల కాదనే స్థితికి వెళ్లాడు. ఆ మ్యాచులో ధోనీ చివరి వరకు నిలిచినా జట్టుకు విజయాన్ని అందించడంలో విఫలంకావడంతో అభిమానులు విస్మయానికి గురయ్యారు.

12 బంతుల్లో 11:
బుధవారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఎంఎస్ ధోనీ విఫలమయ్యాడు. బ్యాటింగ్‌కి ఆర్డర్‌ని మార్చుకుని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ.. స్థాయికి తగినట్లు ఆడలేకపోయాడు. విజయానికి 47 బంతుల్లో 68 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన ధోనీ (11: 12 బంతుల్లో 1x4) ధాటిగా ఆడలేకపోయాడు. కీలక సమయంలో ఒక్క సిక్స్ కూడా బాదలేదు. దీంతో చెన్నై 10 పరుగుల తేడాతో మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది. బ్యాట్స్‌మెన్‌గానే కాదు కెప్టెన్‌గానూ చేతులెత్తేస్తున్నాడు. అతడి స్థాయికి తగినట్లు కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు.

ఐపీఎల్ 2020 కలిసి రావడం లేదు:
కోల్‌కతా పరాజయం తర్వాత వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా స్పందించాడు. ఎంఎస్ ధోనీ గొప్ప ఫినిషర్ అని, కానీ ఐపీఎల్ 2020 మాత్రం అతడికి కలిసి రావడం లేదన్నాడు. 'మ్యాచ్‌లను ఎంఎస్ ధోనీ ఫినిష్ చేయడం ఇప్పుడు పెద్ద పజిల్‌లా మారిపోయింది. కోల్‌కతాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌ని మార్చుకుని మహీ ముందుకు వచ్చాడు. కానీ అతని స్థానంలో మరో ప్లేయర్ (రవీంద్ర జడేజా/శామ్ కరన్)ని పంపి ఉంటే బాగుండేది. ధోనీ గొప్ప ఫినిషర్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఐపీఎల్ 2020లో మాత్రం అతనికి ఏదీ కలిసి రావడం లేదు' అని అన్నాడు.

జడేజా ముందుకు వచ్చి ఉంటే:
'రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ చివరలో ఎలా బ్యాటింగ్ చేశాడో మనందరం చూశాం. ఒకవేళ అతను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి ఉంటే.. చెన్నై విజయావకాశాలు మెరుగయ్యేవి. డ్వేన్ బ్రేవోకు బ్యాటింగ్ చేసే అవకాశాలు సరిగ్గా రావడం లేదు. కోల్‌కతా మ్యాచులో 10 ఓవర్ల తరువాత చెన్నై తడబడింది. అయినా చివర్లో కేవలం 10 పరుగుల తేడాతోనే ఓడారు. ఇది నమ్మశక్యం కానిది' అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించే పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ షోలో బ్రియాన్ లారా వెల్లడించాడు. బుధవారం ఇక్కడి షేక్ జాయెద్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 10 పరుగుల తేడాతో గెలుపొందింది.
రెండు బౌన్సర్లు.. అదనపు ఓవర్.. ఈ మార్పులు చేస్తే టీ20లు అదిరిపోతాయి: గవాస్కర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications