హైదరాబాద్‌లోని ప్రతి న్యూస్ పేపర్లో నీ ఫొటోనే బేటా.. హాస్పిటల్‌లోని సిరాజ్ తండ్రి భావోద్వేగం!!-

హైదరాబాద్: బుధవారం విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత కొత్త బంతితో బౌలింగ్ చేసిన సిరాజ్.. వరుస బంతుల్లో రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణాను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత టామ్ బాంటన్ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 మ్యాచ్‌లో అద్భుత గణాంకాలు:
తొలి రెండు ఓవర్లలో ఒక్క రన్ కూడా ఇవ్వని మహ్మద్ సిరాజ్.. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండు మెయిడ్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లోని రెండు, నాలుగో ఓవర్లను సిరాజ్ మెయిడిన్లుగా వేశాడు. ఒక పరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు. తన కోటా 4 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 4-2-8-3.. ఇవి మహ్మద్ సిరాజ్ గణాంకాలు. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో ఇలాంటి గణాంకాలు నమోదు చేయడం చాలా కష్టం.

హాస్పిటల్‌లో సిరాజ్ తండ్రి:
అయితే కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు మహ్మద్ సిరాజ్ తండ్రి హాస్పిటల్ పాలయ్యారు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో తండ్రి ఆరోగ్యం గురించి సిరాజ్ ఆందోళన చెందాడు. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఫోన్ చేసి మాట్లాడాడు. అయితే మాట్లాడుతున్నంత సేపు తన తండ్రి ఏడుస్తుండటంతో.. సిరాజ్ కూడా ఏడ్చాడట. ఆ తరవాత ఫోన్ కట్ చేశాడట సిరాజ్. తండ్రి హాస్పిటల్ పాలవడంతో తీవ్ర ఆందోళన చెందిన సిరాజ్.. నాన్న ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుణ్ని కూడా ప్రార్థించానన్నాడు.

మొదట నమ్మలేకపోయా:
'గత కొన్ని రోజులుగా నాన్న ఆరోగ్యం బాలేదు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆందోళన చెందా. అయితే ఐపీఎల్ కారణంగా నాన్నను చూడడానికి ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. కోల్‌కతాతో మ్యాచ్ అయ్యాక ఇంటికి కాల్ చేశా. అప్పుడు నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జై ఇంటికొచ్చాడని చెప్పారు. మొదట నమ్మలేకపోయా. నాన్న నాతో మాట్లాడారు. అప్పడు నేను నమ్మాను. నాన్న బాగున్నారని నాకు అర్థమైంది. ఆ సమయంలో ఎంతో సంతోషించా' అని మహ్మద్ సిరాజ్ తెలిపాడు.

ప్రతి న్యూస్ పేపర్లో నీ ఫొటోనే బేటా:
'హైదరాబాద్‌లోని ప్రతి న్యూస్ పేపర్లో నీ ఫొటో ఉంది బేటా అని నాతో నాన్న చెప్పారు. సంతోషంగా ఉందని ఆయన భావోద్వేగం చెందారు. ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మీ అబ్బాయి బాగా ఆడాడు అని చెప్పారని నాన్న తెలిపారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. దీంతో నేను రిలాక్స్ అయ్యాను. భగవంతుని ఆశీర్వాదం వల్ల ఇదంతా జరిగిందని నేను చెప్పాను. మీరు చింతించకండి.. ఇంట్లోనే ఉండి నచ్చింది తినమని చెప్పాను' అని హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు.

రెండు ఓవర్లు మెయిడెన్ :
మొదటి స్పెల్‌లో సిరాజ్ వేసిన మూడు ఓవర్లలో తొలి రెండు ఓవర్లు మెయిడెన్ వేయడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఒక బౌలర్ ఇలా వరుస రెండు ఓవర్లను మెయిడెన్‌గా వేయడం ఇదే తొలిసారి. సిరాజ్ ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం. అంతకుముందు మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకోవడంతో అందరూ కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకాన్ని సిరాజ్ నిలబెట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులు విసురుతూ.. ఈ సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications