ఐపీఎల్-2020లో మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్స్: ఆ హిట్టర్స్ రీ ఎంట్రీకి ఛాన్స్: ఏ టీమ్స్‌కు బెనిఫిట్?

దుబాయ్: ఐపీఎల్-2020లో మరో సందడి నెలకొనబోతోంది. ఐపీఎల్ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్స్ ఆరంభం కాబోతోన్నాయి. ఒక్కో జట్టు ఏడు మ్యాచ్‌లను ఆడిన తరువాత.. క్రికెటర్ల బదిలీని చేపట్టబోతున్నాయి ఆయా ఫ్రాంఛైజీలు. కొత్త వారిని జట్టులోకి తీసుకోవడం.. ఇప్పుడున్న వారిని ఇతర జట్లకు పంపించడానికి సన్నాహాలు చేపట్టబోతున్నాయి. ఇది కాస్త టోర్నమెంట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త ఆటగాళ్ల చేరికతో ఆయా జట్లు ఎలాంటి ప్రదర్శన చేస్తాయనేదీ ఇంటరెస్టింగ్ పాయింట్.

సీనియర్స్ రీ ఎంట్రీకి ఛాన్స్..
యూసుఫ్ పఠాన్, ఆర్ వినయ్ కుమార్, రోహన్ కదమ్, ప్రవీణ్ దుబే ఈ సీజన్‌లో రీఎంట్రీ ఇవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిఛెల్ శాంట్నర్, మిఛెల్ మెక్‌క్లెనెగన్, డేల్ స్టెయిన్, బిల్లీ స్టాన్‌లేక్, డేవిడ్ మిల్లర్.. కొత్త జట్లను వెదుక్కోవచ్చని తెలుస్తోంది. హైప్రొఫైల్ క్రికెటర్‌గా పేరున్న యూసుఫ్ పఠాన్ కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్.. జట్లల్లో ఏదైనా ఒక ఫ్రాంఛైజీ యూసుఫ్ పఠాన్ కోసం పోటీ పడుతున్నాయి.

భువి స్థానంలో..
ఆర్ వినయ్ కుమార్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కర్చీఫ్ వేసిందని అంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ తురుఫుముక్కగా భావించే భువనేశ్వర్ కుమార్, ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్ ఈ సీజన్ మొత్తానికీ రూలౌట్ అయ్యారు. వారిద్దరి స్థానాన్ని భర్తీ చేయడానికి సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఓ పేసర్ అవసరం ఏర్పడింది. వారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఆర్ వినయ్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇదివరకు వినయ్ కుమార్ పలు సీజన్లలో క్రికెట్ ఆడాడు. వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు.

రోహన్ కదమ్..బెంగళూరులోకి..
కర్ణాటక తరఫున లీగ్ మ్యాచ్‌లను ఆడుతోన్న రోహన్ కదమ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో రోహన్ అద్భుతంగా రాణించాడు. ముంబై వంటి బలమైన టీమ్‌పై 81 పరుగులు సాధించాడు. ఇప్పటికే 20 టీ20 మ్యాచ్‌లను ఆడిన అతను 800 పరుగులను సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 142. పార్ట్‌టైమ్ లెగ్ స్పిన్నర్ కూడా. అతణ్ని జట్టులోకి తీసుకోవడానికి ఆర్సీబీ ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతనిపై కన్నేసినట్లు తెలుస్తోంది.

మరో లెగ్ స్పిన్నర్..
కర్ణాటకకే చెందిన మరో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దుబే కూడా ఆక్షన్‌కు రెడీ అవుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ నెట్ బౌలర్‌గా ఉన్న అతణ్ని కొనుగోలు చేయడానికి ఢిల్లీ కేపిటల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. ఈ రెండు జట్లలోనూ స్పిన్ బౌలింగ్ విభాగం పెద్దగా రాణించట్లేదు. అందుకే ప్రవీణ్ దుబేను తీసుకోవడం వల్ల బౌలింగ్ విభాగం మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ రెండు జట్ల ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిఛెల్ శాంట్నర్, మిఛెల్ మెక్‌క్లెనెగన్, డేల్ స్టెయిన్, బిల్లీ స్టాన్‌లేక్, డేవిడ్ మిల్లర్‌లను ఆయా ఫ్రాంఛైజీలు రిలీజ్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications