
అబుదాబి: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 రన్స్ చేసి.. రాజస్థాన్ ముందు 194 పరుగుల లక్ష్యంను ఉంచింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ (79: 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులు) బాదాడు. ఇది ఐపీఎల్‌లో సూర్యకుమార్‌కు అత్యధిక స్కోర్. ఇదివరకు 72 (2018), 71 (2019) పరుగులు చేశాడు. ఇక ఇన్నింగ్స్ చివరలో హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 30 రన్స్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. సూర్యకుమార్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు. రాజస్థాన్ బౌలర్ శ్రేయాస్ గోపాల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి ఓపెనర్లు క్వింటన్ డికాక్ (23: 15 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్), రోహిత్ శర్మ (35: 23 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారించారు. అయితే ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న యువ బౌలర్ కార్తీక్ త్యాగీ తన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసి అదరగొట్టాడు. ఐదో ఓవర్ ఐదో బంతికి ప్రమాదకర డికాక్‌ను అతడు పెవిలియన్ పంపాడు. దీంతో పవర్‌ప్లేలో ముంబై ఒక వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది.
ధాటిగా పరుగులు పిండుకుంటున్న ముంబై బ్యాట్స్‌మన్‌కు రాజస్థాన్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ బ్రేక్ వేశాడు. పదో ఓవర్లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బకొట్టాడు. మొదటి బంతికి క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మను.. రెండో బంతికి అప్పుడే క్రీజులోకి వీచిన వచ్చిన ఇషాన్ కిషన్ (0)ను ఔట్ చేసి ముంబైని ఒత్తిడిలోకి నెట్టాడు. తర్వాతి రెండు ఓవర్లలో ముంబై నిదానంగా ఆడటంతో స్కోరు వేగం తగ్గింది. 12 ఓవర్లకు ముంబై 3 వికెట్లకు 104 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ ఆరంభంలో భారీగా పరుగులిచ్చిన రాజస్థాన్ బౌలర్లు మధ్య ఓవర్లలో పుంజుకున్నారు. ఓవైపు వికెట్లు తీస్తూ ముంబై బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచారు. దీంతో పరుగులు వేగం తగ్గింది. ఈ సమయంలో సూర్యకుమార్ గేర్ మార్చాడు. 33 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. మరోవైపు కృనాల్ పాండ్యా నెమ్మదిగా ఆడాడు. 17 బంతుల్లో 12 పరుగులే చేసి జోఫ్రా ఆర్చర్‌కు చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా ఆచితూచి ఆడాడు.
డెత్ ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు కాస్త తడబడ్డారు. టామ్ కరన్ వేసిన 18వ ఓవర్లో పాండ్యా ఒక ఫోర్, సూర్యకుమార్ ఫోర్, సిక్సర్ బాది 19 రన్స్ రాబట్టారు. 19వ ఓవర్లో 15 రన్స్ రాగా.. చివరి ఓవర్‌లో 17 పరుగులు చేశారు. ఆల్‌రౌండర్ పాండ్యా తనదైన శైలిలో మెరుపులు మెరిపించలేకపోయాడు. సూర్యకుమార్ చివరి వరకు బాధ్యతగా ఆడి జట్టు స్కోరును 190 దాటించాడు. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ రెండు.. కార్తీక్ త్యాగీ, జోఫ్రా ఆర్చర్ చెరో వికెట్ తీశారు.