
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారీ జరిమానా పడింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేటు కారణంగా అతనికి రూ. 12 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు లీగ్ నిర్వాహకులు ప్రకటించారు. ఐపీఎల్ 2020లో రాజస్థాన్ రాయల్స్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి.
'లీగ్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ చేసిన మొదటి నేరం కాబట్టి రూ.12లక్షలు చెల్లించాల్సి ఉంటుంది' అని లీగ్ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 2020లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ కూడా స్లోఓవర్ రేటు కారణంగా జరిమానా చెల్లించారు. నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సమయం బౌలింగ్ చేస్తే.. స్లో ఓవర్‌రేటు కింద పరిగణిస్తారు. ఇందుకుగాను శిక్షగా ఆ జట్టు కెప్టెన్ మ్యాచ్ ఫీజులో కోత లేదా తర్వాతి మ్యాచ్ నుంచి నిషేధం విధిస్తారు.
గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టుపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన రాజస్థాన్ రాయల్స్ .. ఈ సీజన్లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఓడటంతో పాటు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో సంచలన విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్.. ఆ తర్వాత వరుసగా మూడు ఓడి ఢిలా పడింది. ఇక ఇటీవల రికార్డులు పరిశీలిస్తే.. ముంబైపై రాజస్థాన్ ఆధిపత్యం చెలాయించింది. చివరగా జరిగిన ఆరు మ్యాచుల్లో నాలుగింట్లో రాజస్థాన్‌దే గెలుపు. రెండు మ్యాచ్‌లో మాత్రమే ముంబై విజయం సాధించింది.
అబుదాబి వేదికగా మంగళవారం ముంబై, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు చేసిన ముంబై తమ బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (79; 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. దీంతో 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది. ఛేదనకు దిగిన రాజస్థాన్ ఆరంభంలోనే తడబడింది. బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆ జట్టు గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. జోస్ బట్లర్ 70 (44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఎవరూ అతనికి తోడు నిలవకపోడంతో రాజస్థాన్ 57 పరుగుల భారీ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.