
అబుదాబి: ముంబై ఇండియన్స్ జట్టులో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పీకల్లోతు కష్టాలో పడింది. 12 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ముంబై నిర్దేశించిన 194 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఆదిలోనే తడబడింది. ముంబై స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (0)ను ఔట్ చేశాడు. జైశ్వాల్.. కీపర్ క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ పరుగుల ఖాతా తెరవకముందే తొలి వికెట్ కోల్పోయింది.
స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (6) కూడా కీపర్ డికాక్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మూడో ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ మరో వికెట్ తీసి రాజస్థాన్‌ను కోలుకొని దెబ్బకొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్ (0)ను ఔట్ చేశాడు. మూడు బంతులు ఎదుర్కొన్న శాంసన్.. భారీ షాట్ ఆది మిడాన్‌లో రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. దీంతో మూడు ఓవర్లలోనే 12 పరుగులకు రాజస్థాన్ మూడు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది.
ఈ సమయంలో ఓపెనర్ జోస్ బట్లర్, మహిపాల్ లామ్రోర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదు ఓవర్ల పాటు ఈ ఇద్దరు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. బట్లర్ ధాటిగా ఆడగా.. లామ్రోర్ ఆచితూచి ఆడాడు. బట్లర్ రెండు ఫోర్లు బాది ఊపులోకి వచ్చాడు. ఈ దశలో లామ్రోర్ (11) వికెట్ చేజార్చుకున్నాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్లో అంకుల్ రాయ్ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు బట్లర్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 32 బంతుల్లో 43 పరుగులు చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు 10 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్ (43), టామ్ కరన్ (2) పరుగులతో ఉన్నారు. రాజస్థాన్ విజయం సాధించాలంటే ఇంకా 131 పరుగులు చేయాలి. ముంబై బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు.