
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 18 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. అభిమానులు అసలు సిసలైన మజాను ఆస్వాదిస్తున్నారు. మంగళవారం 7:30 గంటలకు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ప్రారంభం అయిన మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ముంబై భారీ స్కోరుపై కన్నేసింది. అయితే ఈ మ్యాచులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెచ్చిపోతాడని, ఇప్పటివరకూ నిలకడగా రాణిస్తున్నా అతడి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు.
ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై మాట్లాడాడు. హార్దిక్ పాండ్యా ఇప్పటివరకూ నిలకడగా రాణిస్తున్నా అతడి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదని, రాజస్థాన్‌తో మ్యాచ్ పూర్తయ్యాక అంతా అతడి గురించే చర్చించుకుంటారని ఆకాశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ముంబై జట్టు బలంగా ఉందని, ఇప్పటికే ఆ జట్టు గాడిలో పడినందున జట్టులో మార్పులు చేసుకోవాలని సూచించాడు.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో ఎక్కువ పరుగులే ఇస్తున్నా కఠినమైన ఓవర్లు వేస్తున్నాడని, గతేడాది గాయం తర్వాత అతడు చాలా రోజుల పాటు ఆటకు దూరమవ్వడంతోనే ఇలాంటి ప్రదర్శన చేస్తున్నాడని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇక రాజస్థాన్ జట్టులో మార్పులు జరగాలని సూచించాడు. గత మ్యాచ్‌లో మహిపాల్‌కు అవకాశం ఇవ్వగా అతడు రాణించాడని, కానీ తాను సంతృప్తి చెందలేదని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ అన్నాడు. ఎందుకంటే ఆ జట్టులో జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ టాప్ 3లో అదరగొడుతున్నారని, సమస్యల్లా నాలుగు నుంచి ఏడు స్థానంలో ఆడేవారని చెప్పాడు. మిడిల్ ఆర్డర్ బాగా ఆడితే రాజస్థాన్ పక్కాగా విజయాలు సాదిస్తుందన్నాడు.
ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ రాజస్థాన్ జట్టులో చేరితే సమతూకంగా మారుతుందని ఆకాశ్ చోప్రా తెలిపాడు. మరోవైపు తొలి మ్యాచ్‌లో అవకాశమిచ్చిన యశస్వి జైశ్వాల్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆకాశ్ చెప్పినట్టే.. ఈ మ్యాచ్ కోసం కెప్టెన్ స్మిత్ మూడు మార్పులు చేశాడు. కార్తీక్ త్యాగి ఐపీఎల్ ఆరంగేట్రం చేశాడు. అప్పుడే ఓ వికెట్ కూడా తీశాడు. ఇక యశశ్వీ జైశ్వాల్, అంకిత్ రాజపూత్ తుది జట్టులోకి వచ్చారు. ఫామ్‌లో లేని రాజస్తాన్ ఆటగాళ్లు జయ్‌దేవ్ ఉనాద్కట్, రాబిన్ ఊతప్పలకు చోటు దక్కలేదు.