
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. లీగ్ దశ ముగుస్తున్న నేపథ్యంలో అన్ని మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఆదివారం అయితే లీగ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకే మ్యాచులో రెండు సూపర్ ఓవర్లు జరిగాయి. కింగ్స్ లెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య రసవత్తరంగా సాగిన పోరులో రాహుల్ సేన రెండో సూపర్ ఓవర్లో విక్టరీ నమోదు చేసింది. అయితే మ్యాచ్ ఆడేవాళ్లకు, చూసేవాళ్లు నరాలు తెగిపోయేంత టెన్షన్‌కు గురయ్యారు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ చివరకు మంచి మజాను అందించడంతో సూపర్ సండేగా మారింది.
కింగ్స్ లెవన్ పంజాబ్ విజయం తర్వాత జట్టు సహ యాజమాని, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా ఆనందానికి అయితే అవధుల్లేకుండా పోయాయి. పంజాబ్ గెలిచిన ప్రతీ సందర్భంలోనూ ఆటగాళ్లను ఉత్సాహపరిచే ప్రీతి.. రెండో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చే వరకూ ఉత్కంఠగా ఎదురుచూశారు. విజయం అంచుల వరకూ వచ్చి కొన్ని మ్యాచ్‌లను పంజాబ్ కోల్పోవడంతో ప్రీతి మళ్లీ ఏమి జరుగనుందోనన్న ఒత్తిడిలో కనిపించారు. చివరకు పంజాబ్ విజయం సాధించడంతో సంతోషంలో ఎగిరి గంతులేశారు. స్టాండ్స్ లో పక్కన ఉన్న వారిని కౌగలించుకుని ఆనందపడ్డారు.
సూపర్ ఓవర్‌లో పంజాబ్ గెలిచిన తర్వాత గెలుపు సంబరాల్ని వీడియో రూపంలో పంచుకున్నారు ప్రీతి జింటా. 'మనం ఏమీ మాట్లాడాలో తెలియనప్పుడు చేసే పనులే మాట్లాడతాయి. రెండు సూపర్ ఓవర్లు. ఓ మై గాడ్. నేను ఇంకా షేక్ అవుతూనే ఉన్నాను. ఇది కింగ్స్ పంజాబ్ బాయ్స్ విజయం. వాటే గేమ్. వాటే నైట్.. వాటే ఫీలింగ్. టీమ్ ఎఫర్ట్‌కు థాంక్యూ. ఇక్కడ టీమ్ వర్క్ అత్యుత్తమం' అని ప్రీతి ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఆదివారం షార్జాలో పంజాబ్, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ తొలుత టై కాగా.. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. ఈ నేపథ్యంలో రెండవసారి సూపర్ ఓవర్‌కు వెళ్లారు. రెండో సూపర్ ఓవర్‌లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్ ఛేదించింది. మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్‌లు బ్యాటింగ్‌కు దిగారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి బంతిని గేల్ సిక్స్ కొట్టగా.. ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్ ఫోర్ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో పంజాబ్ విజేతగా నిలిచింది.