MI vs DC: ఖాతా తెరవకముందే ముగ్గురు డకౌట్... 41 పరుగులకే 5 వికెట్లు.. కష్టాల్లో ఢిల్లీ!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 క్వాలిఫయర్-1లో భాగంగా ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. ముంబై స్టార్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో.. ఢిల్లీ టాప్-3 బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. పృథ్వీ షా (0), శిఖర్ ధావన్ (0), అజింక్య రహానె (0) డకౌటయ్యారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే పృథ్వీ షా, రహానె పెవిలియన్ చేరారు. ఇక బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లోనే ధావన్.. బౌల్డ్ అయ్యాడు. దీంతో ఢిల్లీ పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (12) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో భారీ షాట్ ఆడిన అయ్యర్.. కవర్‌లో ముంబై సారథి రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. రోహిత్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఢిల్లీ 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మార్కస్ స్టోయినిస్ మాత్రం భారీ షాట్లు ఆడాడు.
మరోవైపు రిషబ్ పంత్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. 9 బంతులు ఎదుర్కొని 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఎదురీదుతోంది. స్టోయినిస్ జతగా అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ 11 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 68 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి ఇంకా 54 బంతుల్లో 133 రన్స్ అవసరం. అక్షర్ (6), స్టోయినిస్ (45) క్రీజులో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. సూర్య కుమార్ యాదవ్ (51: 38 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), ఇషాన్ కిషన్ (55 నాటౌట్: 30 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధ శతకాలకు తోడు క్వింటన్ డికాక్ (40: 25 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్), హార్డిక్ పాండ్యా (37 నాటౌట్: 14 బంతుల్లో 5సిక్సర్లు) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది.
ఈ మ్యాచులో నలుగురు టీమిండియా ఓపెనర్లు డకౌట్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, డకౌటయ్యారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా డకౌట్ అయ్యాడు. దీంతో ఒక మ్యాచులో నలుగురు టీమిండియా ఓపెనర్లు డకౌట్ అయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications