
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా మరో బిగ్ ఫైట్ జరగనుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ రెండు మార్పులు చేసింది. షిమ్రాన్ హెట్మయెర్ స్థానంలో అలెక్స్ కారీ, రిషబ్ పంత్ స్థానంలో అజింక్య రహానే జట్టులోకి వచ్చారు. మరోవైపు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గత విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీనియర్, యువ ఆటగాళ్ల కలయికతో ఢిల్లీ సమతూకంతో ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ కీలక సమయంలో బ్యాట్ ఝుళిపిస్తే.. ఢిల్లీకి కష్టాలు తప్పవు. అలాగే ఢిల్లీ జట్టులోనూ లోయర్ ఆర్డర్‌లో మార్కస్ స్టోయినీస్ మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండు జట్లలోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పే బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. ఆరు మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ నాలుగు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ టీమ్ చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అలవోక విజయాల్ని అందుకుని మంచి జోరు మీదుండగా.. ముంబై కూడా హ్యాట్రిక్ విజయాలతో మంచి టచ్‌లో ఉంది. రెండు జట్లలోనూ హిట్టర్లు ఉండటంతో ఈ పోరులో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.
జట్లు:
ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అజింక్య రహానే, మార్కస్ స్టాయినిస్, అలెక్స్ క్యారీ, హర్షల్ పటేల్, ఆర్ అశ్విన్, కాగిసో రబాడ, అన్రిచ్ నోర్జె.