
షార్జా: ఐపీఎల్ 2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్‌లు చెలరేగిపోతున్నారు. ఓపెనర్లు లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు తొలి ఓవర్ నుంచే తమ దూకుడు మొదలుపెట్టారు. క్రీజులో కుదురుకున్న మయాంక్ అగర్వాల్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్-13వ సీజన్‌లో అగర్వాల్‌కిది రెండో అర్ధశతకం.
మయాంక్ అగర్వాల్ ఆరంభం నుంచి స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తూ పంజాబ్ స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. రాహుల్ తెవాటియా వేసిన 8వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్ బాది 19 రన్స్ రాబట్టాడు. మయాంక్ వీరవిహారం చేస్తుండటంతో.. పంజాబ్ 9 ఓవర్లలోనే 100 పరుగులు మార్క్ దాటింది. మరోవైపు కేఎల్ రాహుల్ అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ ఝళిపిస్తున్నాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు.
కింగ్స్ పంజాబ్ పవర్‌ప్లేలో రికార్డు నమోదు చేసింది. ఈ ఐపీఎల్‌లో అత్యధిక పవర్‌ప్లే పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. పవర్‌ప్లేలో కింగ్స్ పంజాబ్ 60 పరుగులు చేసింది. దాంతో ముంబై ఇండియన్స్ నమోదు చేసిన 59 పరుగుల పవర్ ప్లే రికార్డును కింగ్స్ పంజాబ్ అధిగమించింది. అంతేకాదు ఈ సీజన్‌లోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని మయాంక్, రాహుల్ జోడీ నమోదు చేసింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ సహకారం అందిస్తుండటంతో మయాంక్ అలవోకగా భారీ సిక్సర్లు బాదేస్తున్నాడు. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 161 పరుగులు చేసింది. మయాంక్ (95), రాహుల్ (58) క్రీజులో ఉన్నారు. రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మయాంక్‌లు ఆరంభించారు.