48 పరుగుల తేడాతో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. 48 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదివరకు ఓటచిని చవి చూసినప్పటికీ.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓటమిని కొని తెచ్చుకుందనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమౌతున్నాయి. ఘన విజయాన్ని సాధించినప్పుడు ఆకాశానికి ఎత్తేసిన నోళ్లే.. ఇప్పుడు తెగుడుతున్నాయి.
కోచ్ అనిల్ కుంబ్లేను బాధ్యుడిగా..
పంజాబ్ టీమ్ కోచ్ అనిల్ కుంబ్లే, కేప్టెన్ కేఎల్ రాహుల్, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్, స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్, మయాంక్ అగర్వాల్..వారంతా కర్ణాటక నుంచి వచ్చిన ఆటగాళ్లే. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ రాణిస్తున్నారు. భారీ స్కోర్లు సాధిస్తున్నారు. జట్టు విజయానికి బాటలు వేస్తున్నారు. వారి ఆట గురించి తప్పు పట్టలేం. అదే సమయంలో కరుణ్ నాయర్ అంశం ప్రస్తావనకు వస్తోంది. వరుసగా విఫలమౌతోన్న కరుణ్ నాయర్‌ను ఎందుకు డగౌట్‌లో కూర్చోబెట్టట్లేదనే డిమాండ్ నెటిజన్ల నుంచి వినిపిస్తోంది. తాజా పరాజయానికి కోచ్ అనిల్ కుంబ్లేను బాధ్యుడిని చేస్తున్నారు నెటిజన్లు. భాషాభిమానం, ప్రాంతీయ అభిమానాన్ని ప్రదర్శించడం వల్లే పంజాబ్ టీమ్ కూర్పు దెబ్బతిన్నదని, దీనికి అతనే బాధ్యత వహించాలనీ వ్యాఖ్యానిస్తున్నారు.
నాలుగు మ్యాచ్‌లల్లో కరుణ్ నాయర్..
పంజాబ్ జట్టు ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లను ఆడింది. ఈ నాలుగింట్లోనూ కరుణ్ నాయర్ ఆడాడు. అతను చేసిన మొత్తం పరుగులు 16. అబుధాబిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్.. డకౌట్ అయ్యాడు. మూడు బంతులను ఎదుర్కొన్న కరుణ్ నాయర్.. కృనాల్ పాండ్యా బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కరుణ్ నాయర్ వరుసగా విఫలమౌతున్నప్పటికీ.. అతణ్ని మళ్లీ, మళ్లీ ఆడించడానికి కారణం అతను కర్ణాటకకు చెందిన బ్యాట్స్‌మెన్ కావడం వల్లేనని, కోచ్ అనిల్ కుంబ్లే కూడా అక్కడి వాడే కావడం వల్ల ఇంకొక్క ఛాన్స్ ఇస్తున్నారనీ చెబుతున్నారు. తొలి మ్యాచ్‌లో 1, రెండో మ్యాచ్‌లో 15 నాటౌట్, మూడో మ్యాచ్‌లో జీరో స్కోర్ చేశాడు కరుణ్.
కృష్ణప్ప గౌతమ్ పరిస్థితీ అంతే..
కర్ణాటకు చెందిన స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్‌కు కూడా అలాంటి అవకాశమే లభిస్తోందని అంటున్నారు నెటిజన్లు. ముంబైతో మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను అతనితో వేయించడం వెనుక కోచ్ అనిల్ కుంబ్లే, కేప్టెన్ కేఎల్ రాహుల్ ప్రమేయం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ఓవర్.. ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేయడానికి కారణమైందనే విషయాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. మన్‌దీప్ సింగ్ వంటి క్రికెటర్లను ఎందుకు పక్కన కూర్చోబెట్టారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొనక పోతే.. పంజాబ్ జట్టు ఐపీఎల్‌లో మరోసారి వరుసగా పరాజయాలను చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications












