
జట్టు సమష్టితత్వం వల్లే విజయాలు
మ్యాచ్ అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ... 'కోల్‌కతా పై విజయం పట్ల జట్టంతా సంతోషంగా ఉంది. వరుస ఓటముల తర్వాత అందరం సమష్టిగా సానుకూల క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం. అలాగే ముందుకు సాగుతున్నాం. వరుసగా ఐదు విజయాలు సాధించామంటే జట్టు సమష్టితత్వం వల్లే సాధ్యమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ బాగుంది. అందరూ తమ వంతు పాత్ర పోషితున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అందరిలో రెట్టింపు ఆత్మవిశ్వాసం ఉంది. మరిన్ని మ్యాచులు గెలవాల్సి ఉంది. ఆ దిశగా సాగుతాం' అని చెప్పాడు.

మన్‌దీప్ బాధను పంచుకున్నాం
'బయో బుడగలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు, ఆప్తులు దగ్గరుండరు. తండ్రి చనిపోయినప్పటికీ మన్‌దీప్ సింగ్ చూపిన తెగువ మాలో భావోద్వేగం కలిగించింది. మిగతా కుర్రాళ్లూ అతడి బాధను పంచుకున్నారు. ఈరోజు మ్యాచ్‌ను ముగించి తండ్రికి గొప్పగా నివాళి అర్పించాడు. దుబాయ్‌లో ఉండటం వల్ల తన తండ్రి అంత్యక్రియల్లో మన్‌దీప్ వీడియోకాల్ ద్వారా హాజరయ్యాడు. ఆ సమయంలో అతడిని చూసి భావోద్వేగం చెందా' అని కేఎల్ రాహుల్ తెలిపాడు. గత శుక్రవారం మన్‌దీప్ తండ్రి మరణించారు. అతనికి సంఘీభావంగా జట్టులోని ఆటగాళ్లంతా ఆ రోజు ఆడిన మ్యాచులో బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగారు. విజయానంతరం సంబరాలు చేసుకోకుండా ఆకాశం వైపు చూపిస్తూ మన్‌దీప్ తండ్రికి ఘనంగా నివాళులర్పించారు.

గేల్ సింగిల్స్, డబుల్స్ తీయడం బాగుంది
'కోచ్‌గా అనిల్ కుంబ్లే ఉన్నప్పుడు జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండటంలో ఆశ్చర్యం లేదు. రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మొహ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్ పుంజుకున్నారు. షమీ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు తీసి మంచి శుభారంభాలు ఇస్తున్నాడు. ఏడెనిమిదేళ్లుగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌తో కలిసి ఆడాను. కుర్రాళ్లతో కలిసి అతడు సింగిల్స్, డబుల్స్ తీయడం సంతోషంగా ఉంది. అతడు తన జోరు కొనసాగిస్తున్నాడు' అని లోకేష్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

మన్‌దీప్ హాఫ్ సెంచరీ
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. పంజాబ్ బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. గేల్ (51; 29 బంతుల్లో 2×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మన్‌దీప్ (66*; 56 బంతుల్లో 8×4, 2×6) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానానికి చేరుకుంది.
AUS vs IND: కేఎల్ రాహుల్‌కు భారీ ప్రమోషన్.. భవిష్యత్తులో కెప్టెన్సీనే!!


Click it and Unblock the Notifications












