
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతన్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సిరాజ్ తన అద్భుత పేస్ బౌలింగ్‌తో కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ను గడగడలాడించాడు. తన కోటా నాలుగు ఓవర్లలో ఎనమిది పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు మెయిడిన్ కూడా ఉండడం విశేషం. సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితమైంది. 2020 సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (30: 34 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచకున్న కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. సిరాజ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (1) ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి త్రిపాఠి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే అప్పుడే క్రీజులోకి వచ్చిన ఫామ్ బ్యాట్స్‌మన్ నితీశ్ రాణా (0) బౌల్డ్ అయ్యాడు. నవదీప్ సైనీ వేసిన మూడో ఓవర్‌లో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1) కూడా ఔటయ్యాడు. రెండో బంతిని భారీ షాట్ ఆడగా మిడాన్‌లో క్రిస్ మోరీస్ చేతికి చిక్కాడు. దీంతో మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
మహ్మద్ సిరాజ్ వేసిన నాలుగో ఓవర్‌లో టామ్ బాంటన్ (10) కూడా కీపర్ డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్ ఐదు ఓవర్ల పాటు మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. అయితే పరుగులు మాత్రం చేయలేకపోయారు. దీంతో స్కోర్ వేగం బాగా తగ్గిపోయింది. కార్తీక్ 14 బంతుల్లో 4 పరుగులే చేశాడు. తొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి కార్తీక్ ఔట్ అయ్యాడు. చహల్ బౌలింగ్లో కార్తీక్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
ఈ దశలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. బెంగళూరు బౌలర్ల ధాటికి ప్యాట్ కమ్మిన్స్ కూడా పరుగులు చేయలేకపోయాడు. చివరికి 13వ ఓవర్ మూడో బంతికి చహల్ బౌలింగ్లో కమ్మిన్స్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 17 బంతుల్లో 4 పరుగులే చేశాడు. మోర్గాన్ ఒక్కడే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. మోర్గాన్ క్రీజులో ఉండటంతో కోల్‌కతా కనీసం 100 పరుగులైనా చేస్తుందని అనిపించింది. బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబడుతూ ముందుకు సాగాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 16వ ఓవర్ మూడో బంతిని ఫోర్ బాదిన మోర్గాన్.. తర్వాతి బంతికే మిడ్‌వికెట్‌లో గుర్‌కీరత్ సింగ్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు. చివరలో కుల్దీప్ యాదవ్ (12), ఫర్గుసన్ (19 నాటౌట్) పరుగులు చేయడంతో కోల్‌కతా 84 పరుగులు చేసింది. నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.