ఎప్పుడూ బ్యాట్స్‌మెనే అవార్డులు తీసుకుంటారు.. ఇప్పుడు బౌలర్‌కూ రావడం బాగుంది'

దుబాయ్: డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆరోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో 57 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు చేశారు. ఛేజింగ్‌లో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. 4 వికెట్లు తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

బౌలర్‌కూ రావడం బాగుంది:
మ్యాచ్ అనంతరం జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ... 'నేను వికెట్లు తీయకపోయినా, మ్యాచులు గెలిపించకపోయినా ఫర్వాలేదు. నాకో పాత్ర అప్పగించారు. దానిని 100% న్యాయం చేయడమే నాకు ముఖ్యం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే యార్కర్లు వేయడం ముఖ్యం. అందుకే వేశాను. కెప్టెన్ ఎప్పుడు బంతినిచ్చినా.. బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటా. తుది ఫలితంపై నేను దృష్టి పెట్టను. అలా చేసిన ప్రతిసారీ విఫలమయ్యాను. ట్రెంట్ బౌల్ట్‌తో సహచర్యం బాగుంది. ఎప్పుడూ బ్యాట్స్‌మెనే అవార్డులు తీసుకుంటారు. ఇప్పుడు బౌలర్‌కూ రావడం బాగుంది. అయితే మేం గెలుస్తున్నంత వరకు పురస్కారాల గురించి పట్టించుకోను' అని తెలిపాడు.

ఐపీఎల్ 2020లో 27 వికెట్లు
గతేడాది వన్డే ప్రపంచకప్ ముగిశాక లండన్‌లో వెన్నెముకకు సంబంధించి శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా తర్వాత కొద్ది నెలలు ఆటకు దూరమయ్యాడు. బెంగళూరు జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొని పూర్తిగా ఫిట్‌నెస్ సాధించాడు. దాంతో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనా ఆశించినంత మేర రాణించలేకపోయాడు. లాక్‌డౌన్‌తో బుమ్రాకు మంచి విశ్రాంతి దొరికింది. దీంతో ఐపీఎల్ 2020లో చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు మొత్తం 27 వికెట్లు తీశాడు. లీగ్ దశలో రాజస్థాన్‌పై 4 వికెట్లు తీయగా.. ముంబై కూడా అదే ప్రదర్శన చేశాడు. అయితే ఈసారి 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇవ్వడంతో కెరీర్‌లో అత్యుత్తమ టీ20 గణంకాలు నమోదు చేశాడు. ప్లేఆఫ్స్‌లో ముంబై తరఫున ఇదే మెరుగైన ప్రదర్శన. దీంతో బుమ్రా ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

జట్టు అవసరాలే ముఖ్యం
దుబాయ్ పిచ్ బ్యాటింగ్ చేసేందుకు బాగుందని ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. 'నేను మరికొన్ని ఓవర్లు బ్యాటింగ్ చేయాలనుకున్నా. ఏదేమైనా నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాను. టాప్ ఆర్డర్‌లో ఆడేందుకు వెళ్లినప్పుడు ఎక్కువ స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో చివరి దాకా బ్యాటింగ్ చేయాల్సిన బాధ్యతా ఉంటుంది. లీగులో 500 పరుగులు చేయడం గురించి ఆలోచించడం లేదు. వ్యక్తిగత రికార్డులు అవసరమే అయినా.. జట్టు అవసరాలే మరింత ముఖ్యం' అని సూర్య పేర్కొన్నాడు.

మాది వైవిధ్యమైన జట్టు
'నేను త్వరగా ఔటైనా డికాక్, సూర్యకుమార్ గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. ఇదో అద్భుత విజయం. ఎంత లక్ష్యం నిర్దేశించాలని మేమేమీ ఆలోచించలేదు. ఇషాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రెండో టైమ్ ఔట్ తర్వాత అతడికి సానుకూలంగా ఆడాలని సూచించాం. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాలని చెప్పాం. మాది వైవిధ్యమైన జట్టు. అందుకే బౌలింగ్, బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎలాగైనా మార్చుకోగలం. బౌల్ట్ బాగానే ఉన్నాడు. మూడు రోజుల విశ్రాంతి తర్వాత మైదానంలో అడుగుపెడతాడు' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
రిషబ్ పంత్ ఎప్పటికీ ఎంఎస్ ధోనీ కాలేడు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications