
ఢిల్లీ: ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్, విధ్వంసక హిట్టర్ జేసన్ రాయ్ గాయం కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌కి దూరం అయ్యాడు. పాకిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ నుండి కూడా తప్పుకున్నాడు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన చేశాడు. పాకిస్థాన్‌తో శుక్రవారం నుంచి జరగనున్న టీ20 సిరీస్ కోసం సిద్ధమయ్యే క్రమంలో రాయ్ గాయపడ్డాడు.
ప్రాక్టీస్ సెషన్‌లో జేసన్ రాయ్ పక్కటెముకలకి తీవ్రమైన గాయం కావడంతో ఐపీఎల్ 2020 సీజన్‌కి అతను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. రాయ్ స్థానంలో ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ డేనియల్ శామ్స్‌ని తీసుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది. శామ్స్ ఆసీస్ జట్టుకు ఇప్పటివరకు ఆడకపోయినా.. లిస్ట్-ఏ, ఫస్ట్ క్లాస్, టీ20ల్లో ఆడాడు.
ఐపీఎల్ 2018 సీజన్‌లో తొలిసారి ఢిల్లీ తరఫున ఆడిన జేసన్ రాయ్.. ప్రపంచకప్ ఉండడంతో 2019 ఐపీఎల్ సీజన్‌లో ఆడలేదు. దాంతో ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలానికి రాయ్ రాగా.. మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ రూ. 1.5 కోట్లకి కొనుగోలు చేసింది. ఢిల్లీకి శిఖర్ ధావన్, పృథ్వీ షా రూపంలో ఓపెనర్లు ఉన్నారు. అయిన్పటికీ టీ20ల్లో మంచి అనుభవం ఉన్న రాయ్‌ని టాప్ ఆర్డర్‌లో ఆడించాలని ఢిల్లీ భావించింది. కానీ గాయం అతడ్ని ఐపీఎల్‌కి దూరం చేసింది. 2018 ఐపీఎల్ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లాడిన జేసన్ రాయ్ 120 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌తో ఆ సీజన్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు.
ఐపీఎల్ ముంగిట కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కూడా భారీ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ హ్యారీ గుర్నీ భుజం గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. సెప్టెంబర్ నెలలో అతని భుజాని సర్జరీ జరగాల్సిన ఉండడంతో ఈవెంట్ నుంచి వైదొలిగాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన గుర్నీ.. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కోల్‌కతా జట్టులో ఏడుగురు విదేశీ ఆటగాళ్లు కలిపి మెుత్తం 23 మంది ప్లేయర్స్ ఉన్నారు.