
ఫామ్‌లో ఉన్న సూర్య
అయితే ఐపీఎల్ 2020 ఫైనల్లో తమ కెప్టెన్ వికెట్ కాపాడటం కోసం ముంబై స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ తన వికెట్‌ను త్యాగం చేశాడు. లీగ్ ఆరంభం నుంచి మంచి ఫామ్‌లో ఉన్న సూర్య.. రోహిత్ శర్మను కాపాడుకోవడం కోసం రనౌటయ్యాడు. 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ (68; 51 బంతుల్లో 5×4, 4×6), క్వింటన్ డికాక్ (12 బంతుల్లో 20) మంచి శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ స్వేచ్ఛగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. డికాక్‌ను మార్కస్ స్టోయినిస్ పెవిలియన్ చేర్చినా.. రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్.. ఫైనల్లో మాత్రం అద్బుతంగా ఆడాడు.

కెప్టెన్ కోసం వికెట్ త్యాగం
ఆర్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో రోహిత్ శర్మ షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ప్రవీణ్ దూబే వైపు బంతి దూసుకెళ్లింది. అయినా కూడా రోహిత్ అనవసర పరుగు కోసం ప్రయత్నించాడు. సూర్యకుమార్ యాదవ్ వద్దని వారిస్తున్నా.. నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు దూసుకొచ్చాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకే వైపు క్రీజ్‌లోకి రాగా.. దూబే బంతిని వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైపు విసిరాడు. ఇద్దరిలో ఒకరు రనౌట్ కావడం తప్పదని గ్రహించాక.. సూర్య తన వికెట్ త్యాగం చేశాడు. రోహిత్ క్రీజులోకి రాగానే..అతడు బయటకి వెళ్ళిపోయాడు.

నా వికెట్ త్యాగం చేసి ఉండాలి
హాఫ్ సెంచరీ ముంగిట ఉన్న కెప్టెన్ కోసం తను రనౌటయినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి ఉద్వేగం లేదా అసహనం కనిపించనీయలేదు. కానీ తన కారణంగా ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్.. వికెట్‌ను త్యాగం చేయడం రోహిత్‌ను తీవ్రంగా కలచివేసింది. క్రీజులో తన పొరపాటును అంగీకరించాడు. ఇక మ్యాచ్ అనంతరం కూడా ఈ తప్పిదంపై ముంబై కెప్టెన్ రోహ్ట్ శర్మ మాట్లాడుతూ... 'సూర్య మరింత పరిణతి చెందిన ఆటగాడు. అతను ఈ సీజన్లో ఎంతమంచి ఫామ్‌లో ఉన్నాడో తెలుసు. సూర్య కోసం నా వికెట్ త్యాగం చేసి ఉండాలి' అని పేర్కొన్నాడు.

రోహిత్ హాఫ్ సెంచరీ
మంగళవారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఘనవిజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (65 నాటౌట్; 50 బంతుల్లో 6×4, 2×6), రిషబ్ పంత్ (56; 38 బంతుల్లో 4×4, 2×6) మెరవడంతో మొదట ఢిల్లీ 7 వికెట్లకు 156 పరుగులు సాధించింది. ట్రెంట్ బౌల్ట్ (3/30), నాథన్ కౌల్టర్‌నైల్ (2/29), జయంత్ యాదవ్ (1/25) ఆకట్టుకున్నారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, ఇషాన్ కిషన్ (33 నాటౌట్; 19 బంతుల్లో 3×4, 1×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.


Click it and Unblock the Notifications












