
అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా గాయం కారణంగా మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో శ్రీవాత్సవ గోస్వామి జట్టులోకి వచ్చాడు.
గాయం కారణంగా పేసర్ క్రిస్ మోరీస్ మ్యాచ్ దూరమైనట్లు బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ చెప్పాడు. ఇక గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన మరో పేసర్ నవదీప్ సైనీ మళ్లీ జట్టులోకి వచ్చాడు. బెంగళూరు తుది జట్టులో మొత్తం నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. షాబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్, ఇసురు ఉడానా స్థానంలో అరోన్ ఫించ్, ఆడమ్ జంపా, మొయిన్ అలీని తీసుకున్నట్లు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
కీలక పోరులో ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు మాత్రం ఫైనల్ చేరేందుకు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే రెండో క్వాలిఫయర్ ద్వారా మరో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఓడిపోగా.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన సన్‌రైజర్స్ ఉత్సాహంతో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ ఫామ్‌ను కొనసాగించి ఫైనల్‌కు చేరువ కావాలని వార్నర్‌సేన పట్టుదలగా ఉంది.
బెంగళూరు లాంటి బలమైన జట్టును ఎలిమినేటర్‌లో ఓడించాలంటే.. సన్‌రైజర్స్ హైదరబాద్ సమిష్టిగా రాణించాల్సిందే. చాంపియన్‌గా అవతరించిన 2016 సీజన్‌లా.. చివరి మూడు మ్యాచ్‌లు గెలిచిన సన్‌రైజర్స్ నాకౌట్‌లోనూ సీన్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. సీజన్‌లో అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న సన్‌రైజర్స్.. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నది. మరోసారి సమిష్టిగా రాణించాలని చూస్తోంది.
ఐపీఎల్-2020లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయం నమోదు చేసుకున్నాయి. తొలి పోరులో బెంగళూరు 10 పరుగులతో గెలవగా, తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్లతో నెగ్గింది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 17 సార్లు తలపడగా.. 9-7తో హైదరాబాద్ లీడ్‌లో ఉంది. ఇక గత ఐదు మ్యాచ్‌ల్లో బెంగళూరు 2 గెలవగా.. హైదరాబాద్ 3 గెలిచింది. అబుదాబిలో టాస్ మరోసారి కీలకంగా మారింది. ఇక్కడ గత ఐదు మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. డ్యూ కారణంగా అన్ని జట్లు ఛేదనకే మొగ్గు చూపుతున్నాయి.
తుది జట్లు:
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శ్రీవాత్సవ గోస్వామి (కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టీ నటరాజన్.
బెంగళూరు: ఆరోన్ ఫించ్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, మొయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ఆడమ్ జంపా, యుజ్వేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్.