
దుబాయ్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. లీగ్ చివరి మ్యాచ్ వరకు కూడా ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు కాకపోవడం ఇదే తొలిసారి. దీంతో గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్‌లోనే అభిమానులకు అసలైన వినోదం లభిస్తోంది. టోర్నీలో ఎప్పటిలాగే స్టార్ ఆటగాళ్లతో పాటు, వర్ధమాన క్రికెటర్లూ చెలరేగుతున్నారు. 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డు అందుకోవాలని కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తూ.. వారెవ్వా అనిపిస్తున్నారు. ఈజాబితాలో చాలా మందే ఉన్నా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ ముందు వరుసలో ఉన్నాడు.
ఐపీఎల్ 2020లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ ఆకట్టుకున్నాడు. తొలి ఐపీఎల్ సీజన్ అయినా.. అద్భుత బ్యాటింగ్‌లో క్రీడాభిమానుల మనసులను దోచుకున్నాడు. అంతేకాదు అరంగేట్ర సీజన్‌లోనే ఎక్కువ అర్ధ సెంచరీ (5)లు, ఎక్కువ పరుగులు (471) సాధించిన భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నిలిచాడు.
ఐపీఎల్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల జాబితాలో దేవ్‌దత్ పడిక్కల్ మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అరంగేట్రంలోనే అదరగొట్టి అన్‌క్యాప్‌డ్‌గా నిలిచిన వారిలో ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్స్ (616) ముందున్నాడు. 2008 ఐపీఎల్ సీజన్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో సూర్యకుమార్ 512 పరుగులు చేశాడు. తాజా సీజన్‌లో పడిక్కల్ పరుగుల వరద పారించాడు.
ఐపీఎల్ 13వ సీజన్‌లో మొత్తం 5 అర్ధ సెంచరీలు నమోదు చేసిన దేవ్‌దత్ పడిక్కల్.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఐదు హాఫ్ సెంచరీలతో మొత్తం 472 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. 33.71 సగటును, 126.54 స్ట్రైక్ రేట్‌ను సాధించాడు. ఈ సీజన్‌లో పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఒక్కడే అత్యధిక హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ మొత్తం 670 పరుగులు చేశాడు.