
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో లీగ్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. ఈ రోజు దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో ముందుస్తు జాగ్రత్తగా హిట్‌మ్యాన్‌కు మరింత విశ్రాంతి ఇస్తున్నారని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోందట.
తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ శర్మ గత మూడు మ్యాచుల్లో ఆడలేదు. హిట్‌మ్యాన్ స్థానంలో ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. వారం రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్.. పూర్తిగా కోలుకున్నాడు. నెట్స్‌లో సాధన కూడా చేస్తున్నాడు. అయినప్పటికీ అతడిని ఆడించకూడదని ముంబై యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. ఇప్పుడే ఆడిస్తే ప్లేఆఫ్స్‌లో ఇబ్బంది రావొచ్చని భావిస్తున్నారని తెలిసింది. ముందు జాగ్రత్తగా హిట్‌మ్యాన్‌కు మరికొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వాలని ఆ జట్టు ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ప్రస్తుతానికి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదు. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అంతేకాదు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముంబై మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం దుబాయ్ వేదికగా ఢిల్లీ.. మంగళవారం షార్జాలో హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ రెండింట్లోనూ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో కొనసాగాలని పట్టుదలతో ఉంది. ఎందుకంటే.. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు నాకౌట్స్‌లో ఓడినా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం దొరుకుతుంది.
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్లేఆఫ్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ 2020 లీగ్ దశలో ఆరు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లేఆఫ్ చేరుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. ఆరు జట్లలో ఏ టీమ్ ప్లేఆఫ్‌కి చేరుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏ రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది.