
ధోనీ సేనపై చెత్త ట్రాక్ రికార్డ్..
నిజానికి- చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పెర్ఫార్మెన్స్ ఏ మాత్రం బాగా లేదు. చెత్త ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో తొమ్మిది సార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సాధించింది. మూడుసార్లు మాత్రమే హైదరాబాద్ గెలిచింది. మొత్తం మీద ఐపీఎల్‌లో తాను ఆడిన చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింటిని కోల్పోయింది సన్ రైజర్స్. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఇచ్చిన ఊపును వార్నర్ సేన కొనసాగిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

వరుసగా రెండింట్లో ఓటమి..
ఈ ఐపీఎల్ సీజన్‌లో ధోనీ టీమ్ ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. తొలి మ్యాచ్‌లో మాత్రమే బోణీ కొట్టిన చెన్నై జట్టు.. ఆడిన రెండింట్లోనూ వరుసగా పరాజయాలను చవి చూసింది. వరుస ఓటములతో డీలా పడింది. అదే సమయంలో- మిడిలార్డర్ బ్యాటింగ్ బ్యాక్‌బోన్ అంబటి రాయుడు, బౌలింగ్ తురుఫుముక్క డ్వేన్ బ్రావో ఆడటం ఖాయం కావడం.. ఆ జట్టుకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రారంభ మ్యాచ్‌లో ఆడిన రేంజ్‌లో అంబటి బ్యాట్‌ను ఝుళిపించాడంటే.. హైదరాబాద్ జట్టుకు తిప్పలు తప్పవు. షేన్ వాట్సన్, ఫాప్, కేదార్ జాదవ్, ధోనీ, బ్రావో, రవీంద్ర జడేజా వంటి ఆల్‌రౌండర్లతో నిండిపోయి ఉంది.

మురళీ విజయ్ లేదా రుతురాజ్
చెన్నై టీమ్‌లో అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో తిరిగి రావడంతో ఒకరు తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ ఒక్కరు ఎవరనేది ఇంకా తేలలేదు. ఓపెనర్ మురళీ విజయ్ లేదా మిడిలార్డర్‌లో ఉన్న రుతురాజ్‌లల్లో ఒకరిపై వేటు పడొచ్చు. ఓపెనర్‌గా మురళీ విజయ్ ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. అలాగనీ, రుతురాజ్ బాగా ఆడుతున్నాడా? అంటే అదీ లేదు. గెలిచి పరువు నిలుపుకోవాల్సిన మ్యాచ్ కాబట్టి.. అనుభవజ్ఙుడైన మురళీ విజయ్ వైపే కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొగ్గు చూపడానికి అవకాశం ఉంది.

అన్నింట్లోనూ వీక్..
చెన్నై సూపర్ కింగ్స్‌తో పోల్చుకుంటే.. హైదరాబాద్ అన్నింట్లోనూ బలహీనంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ధోనీ సేన స్థాయికి సరితూగట్లేదు. సన్ రైజర్స్ బ్యాటింగ్ మొత్తం.. డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, కొత్త ఆటగాడు అబ్దుల్ సమద్ ఎలా ఆడతాడనేది ఈ మ్యాచ్‌తో తేలిపోతుంది. ఇదివరకే అతను ఓ మ్యాచ్ ఆడాడు. బౌలింగ్ భారాన్ని రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ మోస్తున్నారు. రషీద్ ఖాన్ మొన్నటి మ్యాచ్‌తో ట్రాక్‌లో పడ్డాడు. తక్కువ స్కోరును కాపాడుకోవడంలో సన్ రైజర్స్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అదే ఆ జట్టును ఈ సారి కూడా గట్టెక్కిస్తుందా? లేదా? అనేది తేలుతుంది.

దయనీయ స్థితిలో..
అలాంటి పటిష్టమైన, బలమైన జట్టు.. ఈ సారి దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ జట్టు ఎలాంటి దుస్థితిలో పడిందంటే.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయాన్ని అందుకుంది. మిగిలిన రెండింట్లో దారుణ పరాజయాన్ని చవి చూసింది. వరుసగా రెండు మ్యాచ్‌లను ప్రత్యర్థికి జట్టుకు ధారదాత్తం చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఓ మెట్టు పైనే ఉంది.

సన్ రైజర్స్ కంటే దిగువకే..
ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గిన జట్లల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కటేకాదు..కేఎల్ రాహుల్ సారథ్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహిస్తోన్న ముంబై ఇండియన్స్, డేవిడ్ వార్నర్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్.. సైతం రెండు చొప్పున మ్యాచ్‌లను ప్రత్యర్థికి కోల్పోయాయి. అయినప్పటికీ.. నెట్ రన్‌రేట్ ఆయా టీమ్‌ల కంటే దారుణంగా చెన్నైది. చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్‌రేట్ -0.840గా నమోదైంది. పాయింట్ల టేబుల్‌లో ఎనిమిదో స్థానానికి దిగజారింది. సన్ రైజర్స్ టీమ్ నెట్ రన్‌రేట్ -0.228తో ధోనీ సేన కంటే మెరుగ్గా ఉంది. మైనస్ నెట్ రన్‌రేట్‌తో ఉన్నవి ఈ రెండు జట్లే.


Click it and Unblock the Notifications
