CSK vs RR Preview: చెన్నైతో రాజస్థాన్ ఢీ.. గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు.. ఓడితే ఇక ఇంటికే!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్ల పరిస్థితి ఒకేలా ఉంది. ఇకనుంచి చావోరేవో అన్నట్టు ఉంది. ఐపీఎల్ 2020లో ఇప్పటికి 9 మ్యాచులు ఆడిన చెన్నై మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది.
మరోవైపు అన్నే మ్యాచులు ఆడిన రాజస్థాన్ మూడు విజయాలతో పట్టికలో అట్టడుగున ఉంది. దీంతో రెండు జట్లు ఆడాల్సిన ఐదు మ్యాచులలో కచ్చితంగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోగా.. ఓడిన జట్టు మాత్రం ఇంటికి వెళ్లాల్సిందే. అబుదాబి వేదికగా ఈ రోజు రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలు ఓసారి పరిశీలిద్దాం.

బ్రావో స్థానంలో ఎంగిడీ
గత మ్యాచ్‌లో గెలవాల్సిన చెన్నై అనూహ్యంగా ఓడిపోయింది. దీంతో ఈరోజటి మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో రంగంలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ బాగానే రాణిస్తున్నారు. అంబటి రాయుడు మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. చివరలో రవీంద్ర జడేజా మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. అయితే మిడిల్ ఆర్డర్ సమస్య చెన్నైని వేధిస్తోంది. కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ పూర్తిగా విఫలమవుతున్నారు. ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయం ఆసన్నమైంది. గాయంతో ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో దూరం అయ్యాడు. బ్రావో స్థానంలో లుంగీ ఎంగిడీని తీసుకునే అవకాశాలున్నాయి. సామ్ కరన్, దీపక్ చహర్ పర్వాలేదనిపిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభిస్తే చెన్నై గెలుస్తుంది.

ఉనద్కత్ ఉంటాడా?
రాజస్థాన్‌లో జట్టుకు పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉంది. అయితే నిలకడగా రాణించలేకపోతున్నారు. రాబిన్ ఉతప్ప ఫామ్ అందుకోవడం ఊరటనిచ్చే అంశం. ఈ మ్యాచ్‌లో ఉతప్ప, బెన్ స్టోక్స్‌ను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు తీసుకొస్తారనేది కీలకం. మంచి ఓపెనర్‌గా పేరున్న ఉతప్పను ఫినిషర్‌గా.. మంచి ఫినిషర్‌గా పేరున్న స్టోక్స్‌ను ఓపెనర్‌గా పంపించడం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. జోస్ బట్లర్ అడపాదడపా మాత్రమే రాణిస్తున్నాడు. స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, రాహుల్ తేవాతియా గత కొన్ని మ్యాచులలో రాణించడం లేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఏమాత్రం రాణించడం లేదు. గత మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఉనద్కత్ ఉంటాడా? లేదా? అనేది కూడా ప్రశ్నార్థకమే. జోఫ్రా ఆర్చర్ ఉండడం సానుకూలాంశం.

గత రికార్డులు
చెన్నై, రాజస్థాన్ ఇప్పటి వరకూ 22 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 14 మ్యాచులలో చెన్నై విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ కేవలం 8 మ్యాచుల్లో గెలిచింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో స్మిత్‌సేనదే పైచేయి. చెన్నై ఆడిన గత ఐదు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి.. మూడింట్లో ఓడింది. మరోవైపు రాజస్థాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి నాలుగింట్లో ఓడింది. అబుదాబి మైదానంలో చెన్నై ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ కూడా నాలుగు విజయాలను అందుకుంది.

తుది జట్లు (అంచనా)
చెన్నై: సామ్ కరన్, షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, దీపక్ చహర్, కేదార్ జాదవ్, శార్దూల్ ఠాకూర్, కరన్ శర్మ, లుంగీ ఎంగిడి.
రాజస్థాన్: జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సంజు శాంసన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, కార్తిక్ త్యాగి.
MI vs KXIP: ఐపీఎల్ చరిత్రలో.. తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications