
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కదా.. విరాట్ కోహ్లీ అనేలా ఆడాడు. పరుగుల రారాజు మెరుపు అర్ధ సెంచరీ (90 నాటౌట్; 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ మొదట్లో మొదట్లో పరుగులేమీ రాకున్నా.. చివరలో కోహ్లీ విధ్వంసం సృష్టించడంతో బెంగళూరు 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆద్యంతం క్రీజులో నిలిచిన కెప్టెన్ విరాట్.. చెన్నైపై యధేచ్ఛగా విరుచుకుపడి అజేయ హాఫ్‌సెంచరీతో భారీ స్కోరుకు బాటలు వేశాడు.
విరాట్ కోహ్లీ దుబాయ్ మైదానంలో అద్భుతమైన బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో కోహ్లీ తనలోని వినూత్న షాట్లనూ బయటకు తీశాడు. ఎప్పుడూ ఆడని ఓ కొత్త షాట్ ఆడాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ తరచూ ఆడే స్కూప్ షాట్ ఆడాడు. డ్వేన్ బ్రావో వేసిన 20వ ఓవర్ మొదటి బంతికి ఆఫ్‌సైడ్‌కు జరిగి ఫైన్ లెగ్‌సైడ్‌లో బౌండరీ బాదాడు. షాట్ ఆడిన అనంతరం విరాట్ కిందపడిపోయాడు. ఈ షాట్ అచ్చం ఏబీ ఆడినట్టే ఉంది.
ఈ షాట్ విరాట్ కోహ్లీ ఆడుతాడని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఊహించలేదు. కోహ్లీ షాట్ చూసి మహీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కోహ్లీ ఎప్పుడూ అలాంటి షాట్స్ ఆడలేదు కాబట్టి ధోనీ అక్కడ ఫీల్డ్ పెట్టలేదు. దీంతో ఫైన్ లెగ్‌సైడ్‌లో ఎవరూ లేకపోవడంతో కోహ్లీ ఆ షాట్ ఆడాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. షాట్ చూసిన ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ.. కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాట్ ఏ షాట్ మామ, అచ్చం డివిలియర్స్ స్కూప్ షాట్‌లానే ఉంది అని కామెంట్లు పెడుతున్నారు.
స్వల్ప స్కోరుకే ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరిన పరిస్థితిలో విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం సాగిస్తూ చెన్నై బౌలర్లను ఎదుర్కొన్నాడు. 14.3 ఓవర్లకు బెంగళూరు 93/4తో కష్టాల్లో ఉంది. ఆరంభంలో తడబడి ఆశించిన స్కోరు సాధించలేకపోయినా.. ఆఖర్లో ధనాధన్ బ్యాటింగ్‌తో బెంగళూరు ఇన్నింగ్స్‌ను కోహ్లీ కదం తొక్కించాడు.