
దుబాయ్: టీమిండియా మాజీ వికెట్ కీపర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టీ20 మ్యాచ్‌ల్లో 300 సిక్సర్లు కొట్టిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా శనివారం రాత్రి షేక్ జాయిద్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ రికార్డు సాధించాడు. యుజ్వేంద్ర చహల్ వేసిన 16వ ఓవర్ మూడో బంతిని ధోనీ లాంగ్‌ఆన్ మీదుగా సిక్సర్ బాదాడు. ఆ సిక్సర్‌తో మహీ 300 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు.
యుజ్వేంద్ర చహల్ బౌలింగ్ సిక్స్ కొట్టడం ద్వారా టీ20 క్రికెట్‌లో 300 సిక్సర్లు బాదిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా ఎంఎస్ ధోనీ రికార్డుల్లోకెక్కాడు. ధోనీ కంటే ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (375), చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా (311) ఈ జాబితాలో ఉన్నారు. అయితే బీసీసీఐ నిర్వహించే టీ20 లీగ్‌లోనే మహీ 214 సిక్సర్లు బాదాడు. భారత జట్టు తరఫున 52 ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ మొత్తంగా 323 టీ20లు ఆడిన ధోనీ.. 40.01సగటుతో 6,723 పరుగులు చేశాడు. ఇందులో 27 అర్ధ శతకాలున్నాయి.
అయితే టీ20ల్లో అందరికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు మాత్రం విండీస్ వీరుడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. 404 మ్యాచ్‌లాడిన గేల్.. 978 సిక్సర్లు బాదాడు. ఇక ఐపీఎల్ టీ20 లీగ్‌లోనూ గేల్‌దే హవా. అతను 125 మ్యాచుల్లోనే 326 సిక్సర్లు బాదాడు. గేల్ తర్వాత ఏబీ డివిలియర్స్ (219 సిక్స్‌లు), ఎంఎస్ ధోనీ (214 సిక్స్‌లు), రోహిత్ శర్మ (208 సిక్స్‌లు), సురేశ్ రైనా (194 సిక్స్‌లు) ఉన్నారు.
బ్యాటింగ్ వైఫల్యంతో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఓడింది. ఐపీఎల్-13లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది. 170 పరుగుల ఛేదనలో బెంగళూరు బౌలర్లు వాషింగ్టన్ సుందర్ (2/16), క్రిస్ మోరీస్( 3/19)ల ధాటికి చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసింది. తెలుగు తేజం అంబటి రాయుడు (42: 40 బంతుల్లో 4ఫోర్లు), తమిళనాడు యువ ఆటగాడు ఎన్ జగదీశన్ (33: 28 బంతుల్లో 4ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో చెన్నై భారీ మూల్యం చెల్లించుకుంది. చెన్నై ఖాతాలో ఐదో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.