
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలపై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వయసు అయిపోతున్న (డాడీస్ ఆర్మీ) తమ జట్టులోని బ్యాట్స్‌మెన్ ఆటలో తీవ్రత చూడాలనుకుంటున్నాని తెలిపాడు. ఇప్పటివరకు జరిగిన లోపాలను సరిదిద్దుకుని విజయాల బాట పట్టేందుకు మార్గాలు వెతుకుతున్నామని ఫ్లెమింగ్ చెప్పాడు. శనివారం రాత్రి షేక్ జాయిద్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన 37 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
తాజాగా చెన్నై జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... 'మా విదేశీ ఓపెనర్లు షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ శుభారంభం అందించకపోతే ఒత్తిడిలోకి వెళుతున్నాం. దీనిపై మేం సమాధానాలు వెతుకుతున్నాం. మిడిల్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్ ఆటలో తీవ్రతను చూడాలనుకుంటున్నాను. అయితే మా బ్యాటింగ్ బలంగానే ఉంది. కానీ ఆఖర్లో అధిక భారం పడుతోంది. హిట్టర్లు ముందే స్వేచ్ఛగా ఆడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇతర కారణాల పరంగా చూస్తే.. మాది వయసు అయిపోతున్న జట్టు' అని అన్నాడు.
'జట్టులోని స్పిన్నర్లు మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. చిన్న పాత్ర పోషిస్తున్నారంతే. మా ఆట తీరుని పూర్తిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాం. మేం ప్రతి మ్యాచ్ ఛేదనకు దిగుతున్నాం. వికెట్ చాలా నెమ్మదిస్తుంది. వికెట్లు కోల్పోతుంటే.. లక్ష్య ఛేదన అంత సులువు కాదు. అయితే ఆటలో తీవ్రత పెరగాలి. కేవలం షాట్లకు ప్రయత్నిస్తే సరిపోదు. సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాలి' అని ఫ్లెమింగ్ చెప్పాడు. చెన్నై జట్టును డాడీస్ ఆర్మీ అని పిలుస్తారనే విషయం తెలిసిందే.
బ్యాటింగ్ వైఫల్యంతో చెన్నై సూపర్ కింగ్స్.. బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది. 170 పరుగుల ఛేదనలో బెంగళూరు బౌలర్లు వాషింగ్టన్ సుందర్ (2/16), క్రిస్ మోరీస్ ( 3/19)ల ధాటికి చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసింది. తెలుగు తేజం అంబటి రాయుడు (42: 40 బంతుల్లో 4ఫోర్లు), తమిళనాడు యువ ఆటగాడు ఎన్ జగదీశన్ (33: 28 బంతుల్లో 4ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో చెన్నై భారీ మూల్యం చెల్లించుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 90; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లీగ్‌లో ధోనీసేన పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.