
దుబాయ్: ఐపీఎల్ 2020లో తమకు ఫర్వాలేదనిపించే ఆరంభం దక్కిందని, ఈ క్రమంలో రెండు ఓటములు ఎదురైనా మొత్తంగా మంచి ప్రదర్శనే చేశామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాట్స్‌మన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అన్నాడు. శనివారం జరిగే సెకెండ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో పోటీపడనుంది. ఈ సందర్భంగా డివిలియర్ స్పందించాడు. సామాజిక మాధ్యమాల్లో బెంగళూరు పోస్టు చేసిన ఓ వీడియోలో మాట్లాడాడు.
'ఈ సీజన్‌లో బెంగళూరు జట్టుకు ఫర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. ఈ క్రమంలో రెండు ఓటములు ఎదురైనా.. మొత్తంగా మంచి ప్రదర్శనే చేశాం. అలాగే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి దూరంగా ఏమీ లేము. ఈ విజయ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించడానికి ఏం కావాలనే విషయంపై స్పష్టత ఉంది. బెంగళూరు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నేను బాగానే ఆడా. గత మ్యాచ్‌లో మాత్రం సరిగ్గా రాణించలేకపోయా' అని మిస్టర్ 360 ఏబీ తెలిపాడు. ఇప్పుడు మళ్లీ పరుగులు తీసేందుకు ప్రయత్నిస్తానని డివిలియర్స్ చెప్పాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ వారంలో తమకు మంచి విరామం దొరికిందని, దాంతో సరైన ప్రాక్టీస్ చేశామని తెలిపాడు. ఈ సందర్భంగా తమ జట్టులో లోటుపాట్లను తెలుసుకునేందుకు వీలు కలిగిందన్నాడు. ఇక రాబోయే మ్యాచ్‌ల్లో రాణించి ఈ సీజన్‌లో మరింత ముందుకు వెళ్లాలని ఆశాభావ దృక్పథంతో ఉన్నామని విరాట్ పేర్కొన్నాడు. ఈరోజు తలపడేది ధోనీసేనతో కాబట్టి అదో పెద్ద జట్టని గుర్తుచేశాడు. చెన్నైతో ఆడటం వల్ల తమ బలాబలాలు తెలుస్తాయని వివరించాడు. ఈ మ్యాచ్ తమకు పెద్ద సవాలని దానికోసం మూడు రోజులుగా ప్రాక్టీస్ చేసినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. ఢిల్లీతో అదే ఫామ్ కనబర్చాడు. దీంతో అందరి చూపు అతనిపైనే ఉంది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, ఏబీ డివిలియర్స్ మంచి ఫామ్‌లోనే ఉండగా.. ఢిల్లీతో గత మ్యాచ్‌లో ఈ ముగ్గరు విఫలమయ్యారు. మిడిలార్డర్ బలహీనంగానే ఉంది. టాపార్డర్‌లో ఏ ఇద్దరు చెలరేగిన ఆర్‌సీబీకి తిరుగుండదు.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై, బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 24 సార్లు తలపడగా 15-8తో చెన్నై లీడ్‌లో ఉంది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని సీఎస్‌కే భావిస్తుండగా.. లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఆర్‌సీబీ ఉంది. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచాయి. పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు ఫేవర్‌గా ఉంటుంది. క్రీజులో ఓపికగా ఆడితే పరుగులు తీయవచ్చు. ఇక్కడ రెండు మ్యాచ్‌లు టై అయి సూపర్ ఓవర్‌కు కూడా దారితీసాయి. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 10 మ్యాచ్‌ల్లో 9 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. కింగ్స్ పంజాబ్‌తోనే చెన్నై 10 వికెట్లతో విజయాన్నందుకుంది. ఇప్పటి వరకు చెన్నై ఈ మైదానంలో మూడు మ్యాచ్‌లు ఆడి ఒకటే గెలిచింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ మాత్రం రెండు గెలిచి రెండు ఓడింది. ఈ రెండు కూడా చేజింగ్‌లోనే పరాజయం పాలైంది.