
చెన్నై: టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ప్రపంచ క్రికెట్‌లో కూడా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన సారథి కూడా ఆయనే. టీమిండియా ఖాతాలోకి మూడు మేజర్ ట్రోఫీలు వచ్చాయంటే.. దానికి ప్రధాన కారణం మహీ కెప్టెన్సీనే. ఇక మైదానంలోనూ మిస్టర్ కూల్‌గా వ్యవహరించి భారత క్రికెట్ టీమ్‌కు అత్యున్నత శిఖారలకు చేర్చాడు. ఆటగాడిగానే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా మహీకి మంచి పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. మహీని కలిసేందుకు అతడి ఫ్యాన్స్ మైదానంలోకి దూసుకొచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
గొప్ప కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2020లో అంతగా రాణించట్లేదు. దీంతో ఎప్పుడూ పాయింట్ల పట్టికలో ముందుండే చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి చివరి స్థానాల్లో కొనసాగుతోంది. ఎనిమిది మ్యాచ్‌లాడిన చెన్నై మూడిండిలో మాత్రమే విజయం సాధించింది. ఇక ధోనీ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. గేమ్ ఫినిషర్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన మహీ.. ఈ మధ్య కాలంలో మునిపటిలా ఆడలేకపోతున్నాడు. దానికి తోడు కెప్టెన్‌గా అతడి నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి.

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లలో 79 పరుగులు చేయాల్సిన స్థితిలో కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ డాట్ బాల్స్ ఎక్కువ ఆడారు. బ్యాట్ జులిపించాల్సిన సమయంలో కూడా వేగంగా ఆడలేకపోయారు. దీంతో చెన్నై ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో అందరూ మహీని విమర్శించారు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కెప్టెన్‌గా తన నిర్ణయాలను ధోనీ పరిశీలించుకోవాలని సూచించాడు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు మహీ వీరాభిమాని గోపీ కృష్ణన్ వినూత్నంగా ఆలోచించి అందరికీ పంచ్ ఇచ్చాడు. ఆడినా, ఆడకపోయినా అభిమానం మాత్రం అలానే ఉంటుంది అని నిరూపించాడు.
గోపీ కృష్ణన్ తన ఇంటి మొత్తానికి పసుపు పచ్చ రంగులేసి ఎంఎస్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్‌పై అభిమానం చాటుకున్నాడు. కడలూర్ ప్రాంతం అరంగూర్‌లో తన ఇంటికి 'ఇది ధోనీ ఫ్యాన్ ఇల్లు' అని పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు. ఇంటి గోడలన్నీ మహీ, చెన్నై లోగో ఫొటోలతో నింపేశాడు. అంతేకాదు విమర్శకులపై మండిపడ్డారు. టీమిండియాకు మహీ చేసిన సేవలను మరచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. విమర్శకులకు ధోనీ గొప్పదనం తెలియజెప్పేందుకే ఇలా చేశానని గోపీ కృష్ణన్ తెలిపాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.