
దుబాయ్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్ ప్రారంభం కావడానికి నెల కన్నా తక్కువ సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకొని.. క్వారంటైన్‌లో ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీ తేదీలు ఖరారు అయినా.. మ్యాచ్ షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఈవారంలో అధికారిక షెడ్యూల్ రానుంది. గత శుక్రవారం ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దుబాయ్ గడ్డపై అడుగుపెట్టింది.
కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ కోసం వెళ్లిన ఆటగాళ్లందరు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా నిబంధనలు ఉన్నాయి. దుబాయ్ రూల్స్ ప్రకారం ప్రస్తుతం ఐపీఎల్ ప్లేయర్స్ అందరూ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆటగాళ్లు హోటల్ రూంలోనే ఉంటూ.. ఆయా జట్ల ఫిట్‌నెస్ కోచ్ చెప్పిన విధంగా రోజు వర్కౌట్స్ చేస్తున్నారు. ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి రావడంతో.. బోర్‌గా ఫీలవుతున్నారు. వర్కౌట్లు చేస్తూ, మొబైల్స్ గేమ్స్ ఆడుతూ, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సురేష్ రైనా.. క్వారంటైన్‌లో తన జీవితం ఎలా గడుస్తోందో తెలియజేస్తూ ర్యాప్ పాడి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. 'క్వారంటైన్ సమయంలో ఇదే చేయాల్సి వస్తోంది. వీడియో రికార్డు చేసి, అందరినీ అలరించడమే. మీరేమనుకుంటున్నారో చెప్పండి' అంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఆ వీడియోకి కాప్షన్ రాసుకొచ్చాడు. క్వారంటైన్ సమయంలో జిమ్ చేస్తూ, రోజంతా నెట్‌ఫ్లిక్స్‌లో గడుపుతున్నట్లు ఆ వీడియోలో రైనా చెప్పాడు.
క్వారంటైన్‌లో ఉన్న ఆరు రోజుల్లో ఆటగాళ్లందరికి మూడుసార్లు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ మూడు పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే.. బయో సెక్యూర్ విధానంలో ప్రాక్టీస్‌కి అనుమతిస్తారు. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే.. మళ్లీ క్వారంటైన్‌కు వెళ్లక తప్పదు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న క్రికెటర్లకు ఎవరికీ కరోనా లేకపోవడంతో వారికి ఈ క్వారంటైన్‌తో వచ్చిన నష్టం దాదాపు ఉండకపోవచ్చు.
సురేష్ రైనా ఇప్పటివరకు మొత్తం 193 మ్యాచ్‌లు ఆడి 5,368 పరుగులతో ఐపీఎల్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. 2008 నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడుతున్న రైనా.. మధ్యలో కొచ్చి టస్కర్స్ తరఫున రెండు సీజన్లు ఆడాడు. రైనా సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లాడి.. అత్యధిక మ్యాచ్‌లాడిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే మొత్తంగా 165 మ్యాచ్‌లు ఆడగా.. రైనా 164 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ను రైనా ఆడలేదు. అదికూడా 2018లో కాలి పిక్క గాయం కారణంగా బరిలోకి దిగలేదు.