
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మరో మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 69 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నమెంట్‌లో ముందుకెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఐపీఎల్‌లో నిలవాలంటే.. అన్ని మ్యాచ్‌లనూ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి పంజాబ్ జట్టుకు ఎదురైంది. బ్యాటింగ్, బౌలింగ్. ఇలా అన్ని విభాగాల్లోనూ హైదరాబాద్ జట్టు ముందు నిలవలేకపోయింది. డెత్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లు పుంజుకొన్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
గురువారం రాత్రి సన్ రైజర్స్ చేసిన పరుగులు చూసిన తరువాత.. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఆడి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సగటు అభిమానిలో కలిగింది. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు తరఫున ఆడుతోన్న యూనివర్సల్ బాస్.. ఇప్పటిదాకా క్రీజ్‌లో దిగలేదు. ఒక్క మ్యాచూ ఆడలేదు. కనీసం ఈ మ్యాచ్‌లో అయినా అతను కనిపిస్తాడనుకుంటే.. సాధ్య పడలేదు. ఈ మ్యాచ్‌లో కూడా అతను డగౌట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. క్రిస్ గేల్ ఉండి ఉంటే.. హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడానికి చాలావరకు అవకాశం లభించేదని కామెంట్స్ ఉన్నాయి.
సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఆడతాడంటూ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు కూడా. మ్యాచ్ ఆరంభానికి అతను ఈ విషయాన్ని మీడియాకు చెప్పాడు. తీరా అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. గ్రౌండ్‌లో దిగనూ లేదు. క్రిస్ గేల్ ఎందుకు ఆడట్లేదనే విషయంపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే వివరణ ఇచ్చాడు. హైదరాబాద్‌తో మ్యాచ్ కీలకం కావడం వల్ల.. అతనికి తుది జట్టులో చోటు కల్పించాలని నిర్ణయించుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో డ్రాప్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
క్రిస్ గేల్ ఫుడ్ పాయిజన్‌కు గురయ్యాడని చెప్పాడు. మ్యాచ్‌కు ముందు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యాడని అన్నాడు. దీనితో తుదిజట్టులో అతనికి చోటు కల్పించలేదని చెప్పుకొచ్చాడు. క్రిస్ గేల్ ఆడివుంటే ఫలితం వేరుగా ఉండేదని తాము ఆశిస్తున్నట్లు అనిల్ కుంబ్లె వెల్లడించాడు. తమ నెక్స్ట్ మ్యాచ్‌కు క్రిస్ గేల్ అందుబాటులోకి వస్తాడని, అతణ్ని ఆడిస్తామని చెప్పాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్.. సమష్టి వైఫల్యానికి అద్దం పట్టిందని అనిల్ కుంబ్లే చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలం అయ్యామని అంగీకరించాడు. నికొలస్ పూరన్ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు.