
బ్రావో ఔట్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డ్వేన్ బ్రావో ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్నాడు. గజ్జల్లో గాయంతో టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు. గాయం కారణంగా బ్రావో ఇకపై మ్యాచ్‌లు ఆడలేడని, ఈ ఐపీఎల్ సీజన్ నుంచి అతడు తప్పుకున్నాడని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. గాయం కారణంగా గత శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బ్రావో బౌలింగ్‌ను వేయలేకపోయిన విషయం తెలిసిందే.

స్వదేశానికి పయనం
'ఐపీఎల్ 2020 సీజన్‌లో డ్వేన్ బ్రావో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. గజ్జల్లో గాయంతో అతడు మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఒకటి లేదా రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి వెళ్తాడు. బ్రావో త్వరగా కోలుకునే అవకాశాలు కనిపించడం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని కాశీ విశ్వనాథన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి అని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీజన్‌లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని జట్టు అంతగా రాణించలేకపోయిందని పేర్కొన్నారు. రైనా, భజ్జీ గైర్హాజరు ప్రభావం చూపిందని.. కానీ ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉందని విశ్వనాథన్ అన్నారు.

తాహిర్‌కు ఆడే అవకాశం
సురేష్ రైనా, హర్భజన్ సింగ్‌లకు బదులుగా పియూష్ చావ్లా, కర్ణ్ శర్మలను జట్టులోకి తీసుకుంది చెన్నై యాజమాన్యం. అయితే వారిద్దరూ ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లను ఆడిన పియూష్ చావ్లా ఎకానమీ 9.09గా ఉంది. కర్ణ్ శర్మ ఎకానమీ 8.66గా నమోదైంది. వారిద్దరూ ఏ స్థాయిలో పరుగులను సమర్పించుకున్నారో ఈ లెక్కలు చాలు. డ్వేన్ బ్రావో అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన స్థానంలో కొత్తవారికి తీసుకునే అవకాశాలు దాదాపు లేనట్టే. బ్రావోకు బదులుగా ఇమ్రాన్ తాహిర్‌కు తుదిజట్టులో ఆడే అవకాశం ఉంది.

నిష్క్రమించే మొదటి జట్టుగా చెన్నై
ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లను ఆడిన చెన్నై.. మూడింట్లో మాత్రమే విజయాలు సాధించింది. ఏకంగా ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. పాయింట్ల పట్టికలో చెన్నై ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ స్థాయికి దిగజారడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఆడిన ప్రతి సీజన్‌లోనూ చెన్నై ప్లేఆఫ్ దశకు చేరుకుంది. ఈసారి మాత్రం ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఐపీఎల్ 2020 ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించే మొదటి జట్టుగా చెన్నై నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సీజన్‌లోని లీగ్ దశలో ఇంకా ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఒక్కటి ఓడినా చెన్నై అధికారిక నిష్క్రమణ ఖాయం.


Click it and Unblock the Notifications












