
భువీ ఔట్
'భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2020 ఇక ఆడలేడు. భువీ తుంటి గాయంతో బాధపడుతున్నాడు. అతడు మా జట్టు పేస్ విభాగంకు అధిపతి. అతడు టోర్నీలో లేకపోవడం కచ్చితంగా మాకు ఎదురుదెబ్బే' అని సన్‌రైజర్స్ జట్టుకు చెందిన వారు ఓ జాతీయ మీడియాతో అన్నారు. సన్‌రైజర్స్ జట్టుకు గాయాల బెడద వీడటం లేదు. తొలి మ్యాచ్‌లోనే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం బారినపడి టోర్నీ మొత్తంకు దూరమయిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ మనీశ్ పాండే గాయపడ్డాడు. అయితే అతడు త్వరగానే కోలుకున్నాడు. స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ కూడా గాయం కారణంగా రెండు మ్యాచులకు దూరమయ్యాడు.

బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. 19వ ఓవర్ తొలి బంతిని విసిరే క్రమంలో భువీకి గాయం అయింది. తొడ కండరాలకి గాయమవగా.. మొదట నడిచేందుకు అతడు ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత ఫిజియో సాయంతో మళ్లీ బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. రెండో బంతి వేసే క్రమంలో రనప్ పూర్తి కాకుండానే గాయం తీవ్రత కారణంగా వికెట్ల వద్దకి వచ్చి ఆగిపోయాడు. అయినా బౌలింగ్ వేసేందుకు మూడు సార్లు ప్రయత్నించాడు. నొప్పి భరించలేక ఆఖరికి మైదానాన్ని వీడాడు. దీంతో ఓవర్‌ను మరో పేసర్ ఖలీల్ అహ్మద్ పూర్తి చేశాడు.

భారీ ఎదురుదెబ్బే
భువనేశ్వర్ కుమార్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆదివారం సాయంత్రం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో అతడు ఆడలేదు. ఇప్పుడు ఏకంగా మొత్తం టోర్నీ నుంచే తప్పుకున్నాడు. భువనేశ్వర్ ఐపీఎల్ 2020లో లేకపోవడం సన్‌రైజర్స్‌కు భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే.. అతడే జట్టులో ప్రధాన పేసర్. ముంబై మ్యాచులలో భువీ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

గత కొంతకాలంగా
భువనేశ్వర్ కుమార్‌ని గత కొంతకాలంగా తొడ కండరాల గాయం వేధిస్తోంది. గత ఏడాది చివరలో కూడా ఇదే గాయంతో టీమిండియాకి దూరమయ్యాడు. ఇప్పుడు కూడా భువీ తొడకండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఓ ఫాస్ట్ బౌలర్ తొడ కండరాల గాయం నుంచి వేగంగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించడం కష్టం. అంతర్జాతీయ కెరీర్‌లో భువీ ఇప్పటివరకు 21 టెస్టుల్లో, 114 వన్డేల్లో, 43 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.


Click it and Unblock the Notifications
