
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. నవంబరు 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 53 రోజుల పాటు 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. ఇక ఐపీఎల్ 2020 సీజన్ స్ఫాన్సర్‌షిప్ నుంచి చైనాకి చెందిన మొబైల్ కంపెనీ 'వివో'ని తప్పించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. తాజాగా రూ. 222 కోట్లకి ఆ హక్కుల్ని ఫాంటసీ గేమింగ్ సంస్థ 'డ్రీమ్11'కి అప్పగించింది. ఈ నేపథ్యంలో కొత్త టైటిల్ స్ఫాన్సర్ డ్రీమ్11తో ఐపీఎల్ లోగోని బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది.
ఐపీఎల్ 2020 లోగోకి సంబంధించిన ఫొటోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. వివో లోగో స్థానంలో డ్రీమ్11 అని ఉంది. డ్రీమ్11 బ్యాక్ గ్రౌండ్ ఎరుపు రంగులో ఉంది. వివో బ్యాక్ గ్రౌండ్ బ్లూ రంగులో ఉండేది. ఐపీఎల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోనూ కొత్త లోగో అని షేర్ చేసింది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు కూడా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఐపీఎల్ 2020 లోగో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది కూడా వివోనే టైటిల్ స్ఫాన్సర్‌గా కొనసాగుతుందని.. మూడు వారాల క్రితం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కానీ సరిహద్దు వివాదం కారణంగా బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. 'బాయ్‌కాట్ ఐపీఎల్' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దాంతో వెనక్కి తగ్గిన బీసీసీఐ.. వివోతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.
ఐపీఎల్ 2020 కోసం ఫ్రాంచైజీలు యూఏఈ బాటపట్టాయి. ఇప్పటికే మూడు జట్లు అక్కడికి చేరుకున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లు గురువారం చార్టెడ్ ఫ్లయిట్‌లలో దుబాయ్ చేరుకోగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ అబుదాబీలో దిగింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు శుక్రవారం దుబాయ్‌కి బయల్దేరతాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఈ వారాంతంలో పయనం కానున్నాయి.