
దుబాయ్: కరోనా మహమ్మారి ఒకవైపు భయపెడుతున్నా.. యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ 2020 విజయవంతమైంది. ఐపీఎల్ టోర్నీని బయో బబూల్ వాతావరణంలో నిర్వహించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19న ప్రారంభం అయిన మెగా టోర్నమెంట్ నవంబర్ 10తో ముగిసింది. కరోనా వైరస్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో టోర్నీని అబుదాబి, దుబాయ్, షార్జా స్టేడియాల్లో నిర్వహించారు. క్యాష్ రిచ్ లీగ్ విజయవంతమవడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్విట్టర్ వేదికగా అందరిని ప్రశంసించారు.
'ఐపీఎల్ టోర్నీని సక్సెస్ చేసిన ఆఫీసు బేరర్లతో పాటు ప్రతి ఐపీఎల్ జట్టు ప్లేయర్‌కు వ్యక్తిగతంగా థ్యాంక్స్. అత్యంత కట్టుదిట్టమైన బయోబబూల్ వాతావరణంలో ఐపీఎల్ టోర్నమెంట్‌ను నిర్వహించడం అద్భుతం. మానసికంగా టోర్నీ నిర్వహణ కష్టం. కానీ మీరు చూపిన తెగువ అద్భుతం. భారత క్రికెట్ ఖ్యాతిని పెంచారు. అంతేకాదు భారత క్రికెట్ అంటే ఏంటో చూపించారు' అని సౌరవ్ గంగూలీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మార్చిలోనే ఐపీఎల్ 2020 ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఓ దశలో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ అసాధ్యమనిపించింది. కానీ బీసీసీఐ పట్టుదలతో ఉండి లీగ్‌ను యూఏఈకి తరలించింది. టోర్నీ వేదిక మార్పుకు భారత ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ప్లేయర్లు అంతా దుబాయ్ వెళ్లారు. టోర్నీ ప్రారంభానికి ముందు ప్లేయర్లు దుబాయ్‌కి నెల రోజుల ముందే చేరుకున్నారు. తమ తమ హోటళ్లలో ప్లేయర్లు క్వారెంటైన్‌లో ఉన్న తర్వాత.. ప్రాక్టీసు ప్రారంభించారు. ఆ తర్వాతే షార్జా, దుబాయ్ ప్రభుత్వ నియమావళి ప్రకారం ఐపీఎల్ టోర్నీ నిర్వహించారు.
ఐపీఎల్ 2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజర్లు, మెడికల్ టీంకు ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్‌ను చక్కగా నిర్వహించారని కొనియాడారు. డ్రీమ్ ఐపీఎల్‌గా మార్చారంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా, బ్రిజేష్ పటేల్, మెడికల్ స్టాఫ్ పేర్లను రవిశాస్త్రి ప్రస్తావించాడురు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరును మాత్రం ట్యాగ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ టీమిండియా కోచ్‌పై మండిపడుతున్నారు.