
గుజరాత్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముద్దుల కుమార్తె 'జీవా'పై అసభ్యకర కామెంట్లు చేసిన 16 ఏళ్ల బాలుడిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కచ్ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందినవాడిగా రాంచీ పోలీసులు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని అదుపులోని తీసుకొని విచారించగా.. ఆ పోస్ట్ తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. రాంచీ పోలీసులు ఇక్కడికి వచ్చిన అనంతరం బాలుడుని వారికి అప్పగిస్తామని కచ్ జిల్లా ఎస్పీ సౌరబ్ సింగ్ తెలిపారు.
ఐపీఎల్ 2020లో భాగంగా గత బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో గెలుపు దిశగా దూసుకెళ్లిన చెన్నై.. ఆఖర్లో తడబడి చేతులెత్తేసింది. మిడిల్ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఎస్ ధోనీ విఫలమవ్వగా.. క్రీజులో కడవరకు నిలిచిన కేదార్ జాదవ్ ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఓడింది. చెన్నై ఓటమికి జాదవ్ కారణమని ధోనీ అభిమానులు ట్రోల్ చేయగా.. ధోనీ కూడా ఏం తక్కవ కాదని, అతనికి కూడా అంతే బాధ్యత ఉందని మరికొందరు కామెంట్ చేశారు.
ఎంఎస్ ధోనీ సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని, మళ్లీ సరిగ్గా ఆడకపోతే జీవా ధోనీపై అత్యాచారం చేస్తానంటూ 16 ఏళ్ల బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. పలు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు దీన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాంచీ పోలీసులు నిందితుడిని గుర్తించారు.
భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదనడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధిస్తుంటారు అభిమానులు. వారి విజయాలను తమ గెలుపుగా భావిస్తూ, ఓటమి ఎదురైన సమయాల్లో వారికి మద్దతు ప్రకటిస్తూ అభిమానం చాటుకుంటారు. కానీ కొంతమంది అభిమానం పేరిట పిచ్చి వేషాలు వేయడమే గాకుండా హద్దులు దాటి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విపరీత ధోరణి మరింతగా పెరిగిపోతోంది. ఆకతాయిలను అరికడితేనే ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోవు.