
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే ప్లేయర్ మరియు సహాయక సిబ్బందిలోని 12 మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఫాస్ట్ బౌలర్ సహా మిగతా 12 మందిలో సహాయక సిబ్బంది, సోషల్ మీడియా బృందం ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. అయితే వైరస్ సోకిన అందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందట.
ఐపీఎల్ 2020 కోసం గతవారమే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకున్న విషయం తెలిసిందే. ధోనీసేన ఈ నెల 21న దుబాయ్‌లో అడుగుపెట్టింది. అక్కడి నిబంధనల ప్రకారం.. ఆటగాళ్లకు 1,3, 6 రోజులూ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడు ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో సీఎస్‌కే ఆటగాడికి, 12 మంది సిబ్బందికి కరోనా కరోనా సోకిందని దుబాయ్ వర్గాలు పీటీఐకి తెలిపాయి. టీమిండియాకు ఈ మధ్యే ఆడిన కుడి చేతి వాటం మీడియం పాస్ట్ బౌలర్ ఒకరు, సిబ్బందిలో కొందరికి కరోనా సోకింది. సీఎస్‌కే నిర్వాహక బృందంలోని సీనియర్ అధికారి, ఆయన భార్యకు.. సోషల్ మీడియా బృందంలో కొందరికి వైరస్ సోకింది' అని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే సిబ్బందిలో 12 మందికే కరోనా సోకినట్టు కొన్ని వెబ్‌సైట్లు వార్తలు రాస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయమై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ఇక కరోనా సోకిన విషయం తెల్సిన వెంటనే.. అప్రమత్తమైన సీఎస్‌కే యాజమాన్యం వారిని క్వారంటైన్‌లోకి పంపించింది. అన్ని జాగ్రత్తలు తీసుకుందట. వైరస్ సోకిన అందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందట.
ఆటగాడు, సిబ్బందికి వైరస్ సోకడంతో సీఎస్కే బృందం సెప్టెంబర్ ఒకటి వరకు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కరోనా బాధితులు మాత్రం అదనంగా మరో ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. మరోసారి పరీక్షించి.. నెగెటివ్ వచ్చాకే వారు బయో బుడగలో అడుగుపెడతారు. మిగిలిన అందరికీ శుక్రవారం మరోసారి (నాలుగోసారి) పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ ఫలితాలు శనివారం వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి 13 మందికి వైరస్ సోకడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కలవరపాటు మొదలైంది.