
ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా
ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6 బాదిన ఏబీ డివిలియర్స్ 18 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 22 పరుగులుగా మారింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో డివిలియర్స్‌ని కట్టడి చేస్తూ కేవలం 5 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు దూకుడుగా ఆడుతోన్న గ్రాండ్‌హోమ్ (2)ని ఔట్ చేశాడు.

5 బంతుల్లో 17 పరుగులుగా సమీకరణం
దీంతో సమీకరణం 5 బంతుల్లో 17 పరుగులుగా మారింది. ఇక, ఆఖరి ఓవర్ వేసిన మలింగ తొలి బంతికే సిక్స్ కొట్టించుకున్నా తర్వాత తన యార్కర్లలో వరుసగా 1, 1, 1, 1,0 తో ముంబైని గెలిపించాడు. నిజానికి ఆఖరి బంతిని మలింగ నోబాల్‌గా విసిరినా ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోయాడు. మ్యాచ్ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది.

అంపైర్ల పొరపాటును బిగ్‌స్క్రీన్‌పై చూసిన కోహ్లీ
అంపైర్ల పొరపాటును బిగ్‌స్క్రీన్‌పై చూసిన కోహ్లీ.. ప్రజంటేషన్ సమయంలో అంపైర్ల తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ మాట్లాడుతూ "మేం ఆడేది ఐపీఎల్.. క్లబ్ స్థాయి క్రికెట్ కాదు. అంపైర్లు దీన్ని గమనించాల్సి ఉంది. ఉత్కంఠపోరులో ఇలాంటి తప్పిదాలు మంచిది కాదు. ఏకంగా అంగుళం తేడాతో అడుగు పడింది. అంపైర్లు ఏమైనా కళ్లు మూసుకున్నారా! ఇలాంటి చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి." అని అన్నాడు.

ఏం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు
"అసలేం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు. వాళ్లు మరింత జాగ్రత్తగా, చురుగ్గా ఉండాల్సింది. ముంబై 145/7తో పటిష్టంగా ఉన్నాం. కానీ చివరి ఓవర్లు మాకు కష్టంగా మారాయి. డివిలియర్స్ అద్భతంగా ఆడాడు. మేం ఇంకా డెత్ ఓవర్లలో మెరుగవ్వాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారు. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు" అని కోహ్లీ అన్నాడు.

బుమ్రా టాప్ క్లాస్ బౌలర్
"వారి ఆట నుంచి మేం చాలా నేర్చుకున్నాం. నేను కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఔటయ్యాను. శివం అద్భుతంగా ఆడాడు. బుమ్రా టాప్ క్లాస్ బౌలర్. నేను అతని బౌలింగ్ ఎదుర్కునే విధానంలో తప్పు చేశాను. ముంబై జట్టులో బుమ్రా, మలింగాలు ఉండటం ఆ జట్టు అదృష్టం. బుమ్రా ఫామ్‌లో ఉంటే అది భారత్ జట్టుకు మంచిదే" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications

