
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్‌కి సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంళూరుతో సాయంత్రం 4 గంటలకి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఆడటం లేదు. దీంతో అతని స్థానంలో భువనేశ్వర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్ విలియమ్సన్, నదీం స్థానాల్లో దీపక్ హూడా, మహమ్మద్ నబీలు జట్టులోకి వచ్చారు. ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ తొలి అర్ధభాగంలో పిచ్ స్లోగా ఉండే అవకాశం ఉండడంతో బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలిపాడు.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కలిసి వస్తుందని అన్నాడు. ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నామని, నవ్‌దీప్ సైనీ స్థానంలో ప్రయాస్ బర్మన్‌ను జట్టులోకి తీసుకున్నట్టు కోహ్లీ తెలిపాడు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ జట్టు.. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో అనూహ్యంగా ఓడి.. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.
దీంతో ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంళూరు ఒత్తిడితో బరిలోకి ఉంది. సొంతగడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలవాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరుతుండగా.. బెంగళూరు కనీసం ఈ మ్యాచ్‌తోనైనా టోర్నీలో బోణి చేయాలని ఆశిస్తోంది. ఐపీఎల్‌లో మొత్తంగా ఈరెండు జట్లూ ఇప్పటి వరకూ 13సార్లు తలపడగా ఏడింట సన్‌రైజర్స్.. ఐదింట బెంగళూరు జట్టు గెలుపొందింది.
ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక ఉప్పల్ స్టేడియంలో ఇప్పటి వరకూ ఇరు జట్లు ఆరు మ్యాచ్‌ల్లో తలపడగా సన్‌రైజర్స్ ఏకంగా 5 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. బెంగళూరు కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. దీంతోపాటు సన్‌రైజర్స్ జట్టులో ఉన్న పేసర్ సందీప్ శర్మ బౌలింగ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా ఐదు సార్లు ఔటయ్యాడు.
వీరిద్దరూ ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌ల్లో ఢీకొనగా రెండు సార్లు విరాట్ కోహ్లీని కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయనివ్వకుండానే సందీప్ శర్మ ఔట్ చేశాడు.
జట్ల వివరాలు:
సన్ రైజర్స్ హైదరాబాద్:
భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విజయ్ శంకర్, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, దీపక్ హుడా, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థివ్ పటేల్, మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్‌మెయిర్, గ్రాండ్‌హోమ్, శివం దూబే, చహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రయాస్ బర్మన్