
ఫామ్ లేమితో షేన్ వాట్సన్:
ఐపీఎల్ 2018 ఫైనల్ తర్వాత ఫామ్ లేమితో ఈ సీజన్‌లో పరుగులు చేయలేక చాలా ఇబ్బందిపడుతున్నాడు షేన్ వాట్సన్. ఎంతలా అంటే చెన్నై ఆడిన 9 మ్యాచ్‌ల్లో.. వాట్సన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. అయినా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ అతనిపై నమ్మకం ఉంచి జట్టులో కొనసాగించాడు. ఎట్టకేకలకు కెప్టెన్ నమ్మకాన్ని వాట్సన్ విధ్వంసక ఇన్నింగ్స్ తో నిలబెట్టుకున్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన ప్రత్యర్థిపై మరోసారి ఫామ్ అందుకున్నాడు.

బౌండరీలు, సిక్సుల వర్షం:
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైఆరంభం చూస్తే ఆ జట్టు గెలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. మొదటి ఓవర్ మేడిన్. రెండో ఓవర్ నాలుగో బంతి వరకు స్కోర్ 0. ఐదో బంతికి డుప్లెసిస్ ఒక సింగల్ తీయగా.. చివరి బంతికి వాట్సన్ మరో సింగల్ తీసాడు. మూడో ఓవర్లో డుప్లెసిస్ (1) వికెట్ కోల్పోయింది. 3 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 8/1. ఖలీల్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్లో వాట్సన్ సిక్స్, ఫోర్ కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. సందీప్ శర్మ వేసిన ఆరో ఓవర్లో రైనా చెలరేగి.. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు పిండుకున్నాడు. తర్వాత వాట్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించాడు. బౌలర్ ఎవరైనా సరే బౌండరీలే లక్ష్యంగా ఆడడంతో.. కొండంత లక్ష్యం కరిగిపోయింది. అయితే సెంచరీకి 4 పరుగుల దూరంలో వాట్సన్ (96; 53 బంతుల్లో 9×4, 6×6) పెవిలియన్ చేరాడు. అయితే లక్ష్యాన్ని చెన్నై 19.5 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది.

తండ్రీకొడుకుల అనుబంధం:
ఈ విధ్వంసక ఇన్నింగ్స్‌కు స్టాండ్స్ లో ఉన్న వాట్సన్ కొడుకు విలియం వాట్సన్ ఫిదా అయి విజయ సంకేతం చూపించగా.. మైదానంను వీడుతున్నషేన్ వాట్సన్ మురిసిపోయి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. దానికి విలియం వాట్సన్ కేరింతలు కొట్టాడు. ఇదేకదా తండ్రీకొడుకుల అనుబంధం. మరోవైపు వాట్సన్ సతీమణి కూడా అభినందనలు తెలిపింది. దీనికి సంబందించిన పోటోలను చెన్నై యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications












