

హైదరాబాద్: మార్చి 23న ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో అప్పుడే ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్‌లు ఏర్పాట్లు చేస్తున్నాయి. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల మధ్య సమన్వయం, క్రికెటర్ల ఫిట్‌నెస్ స్థాయిలు తెలుసుకునేందుకు ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.
తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ప్రీటోర్నమెంట్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ క్యాంప్‌లో తొలుత ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయిని తెలుసుకునేందుకు పరీక్షలు పెడుతున్నాయి.

2013 నుంచి 2015 ఐపీఎల్ సీజన్ వరకూ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా పనిచేసిన ఆప్టన్.. తాను బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే రాజస్థాన్ రాయల్స్ జట్టుని ప్లేఆఫ్‌కు చేర్చాడు. ఆప్టన్ ప్రపంచవ్యాప్తంగా పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌తో పాటు బిగ్‌బాష్, పాకిస్థాన్ సూపర్ లీగ్‌ల్లోనూ పలు జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
ఆప్టన్ మార్గదర్శనంలోనే సిడ్నీ థండర్స్ 2016లో బిగ్‌బాష్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ క్యాంప్‌నకి సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానె, జయదేవ్ ఉనాద్కత్, స్టువర్ట్ బిన్నీ, ధావళ్ కులకర్ణి, వరుణ్ అరోన్, శ్రేయాస్ గోపాల్, రాహుల్ త్రిపాఠి, మనన్ వోహ్రాతో పాటు ఈ సీజన్ కోసం ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసిన జూనియర్ ఆటగాళ్లు పలువురు హాజరయ్యారు.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పింక్ జెర్సీతో బరిలోకి దిగనుంది. 2018 ఐపీఎల్ సీజన్‌లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పింక్ కలర్ జెర్సీతో ఓ మ్యాచ్ ఆడిన రాజస్థాన్ జట్టు.. 2019 సీజన్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ అదే జెర్సీతో ఆడబోతున్నట్లు వెల్లడించింది.