
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఘనమైన బోణి అందుకుంది. పేరు, జెర్సీతో పాటు ఆటతీరును కూడా మార్చుకుని సమిష్టి కృషితో విజయాన్ని అందుకుంది. ఆదివారం వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్‌గా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (14) నాలుగో ఓవర్‌లోనే పెవిలియన్ చేరిపోగా.. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2) నిరాశపరిచాడు. ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ డికాక్ (27) కూడా ఔటడంతో ముంబై 45/3తో కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, పొలార్డులు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో యువరాజ్(53)మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్య (0) కూడా ఔటవడంతో మ్యాచ్‌పై ముంబయి పట్టుజారింది. దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసింది.
ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, రబడాలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. పాల్, తెవాటియా, బౌల్ట్, అక్షర్‌లు తలో వికెట్ సాధించారు. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో రిషబ్ పంత్ (78 నాటౌట్: 27 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
దీంతో ముంబై ఇండియన్స్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బౌలర్లలో బుమ్రాతో సహా అందరి బౌలింగ్‌లోనూ పంత్ సిక్సర్ల మోత మోగించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే పృథ్వీషా(7) వికెట్‌ను కోల్పోయింది. ఆపై కాసేపటికి శ్రేయస్ అయ్యర్(16) కూడా పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారిన ఓపెనర్ శిఖర్ ధావన్ (43: 36 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) జట్టుకి మెరుగైన ఆరంభమివ్వగా.. మిడిల్ ఓవర్లలో ఇంగ్రామ్ (47: 32 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్)తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ 83 పరుగులు జత చేయడంతో ఢిల్లీ గాడిలో పడింది.
అయితే శిఖర్ ధావన్, ఇన్‌గ్రామ్‌లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు. 27 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్పర్లతో అజేయంగా 78 పరుగులు చేశాడు.
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్‌గాన్ మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దిక్ పాండ్యా, బెన్ కట్టింగ్‌లు తలో వికెట్ తీశారు.