
హైదరాబాద్: మొహాలి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
లక్ష్య ఛేదనలో రాహుల్ త్రిపాఠి 45 బంతుల్లో 50(4 ఫోర్లు) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. జోస్ బట్లర్ 17 బంతుల్లో 23(ఫోర్, 2 సిక్సులు), సంజూ శాంసన్ 21 బంతుల్లో 27(2 ఫోర్లు) ఫరవాలేదనిపించారు. చివర్లో స్టువర్ట్ బిన్నీ 11 బంతుల్లో 33(2 ఫోర్లు, 3 సిక్సులు) మెరిసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, అశ్విన్, షమీలు తలో రెండో వికెట్లు తీశారు.
రాజస్థాన్ విజయ లక్ష్యం 183
అంతకముందు ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 52 (3 ఫోర్లు, 2 సిక్సులు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ కు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 38 పరుగుల వద్ద క్రిస్ గేల్ 22 బంతుల్లో 30 (2 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ పంజాబ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు.
వీరిద్దరూ 85 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 52(3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పురాన్(5) నిరాశపరిచాడు. జోఫ్రా ఆర్చర్ 19వ ఓవర్‌లో 3 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి పంజాబ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.
అయితే, చివర్లో అశ్విన్ 4 బంతుల్లో 17 నాటౌట్ (ఫోర్, 2 సిక్సర్లు) చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదడంతో పంజాబ్ 182 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా... ఇష్ సోథీ, జయదేవ్ ఉనాద్కత్, ధావల్ కులకర్ణి తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
అంతకముందు టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ అజ్యింకె రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. శామ్ కర్రన్ స్థానంలో డేవిడ్ మిల్లర్‌ని తుది జట్టులోకి తీసుకోగా... ఈ మ్యాచ్‌తో హర్షదీప్ సింగ్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఇకపై జరిగే మ్యాచుల్లోనూ తప్పక గెలవాలి.
ఇక, రాజస్థాన్ మాత్రం జట్టులో మూడు మార్పులు చేసింది. టర్నర్, స్టువర్ట్ బిన్ని, ఇష్ సోదీలకు రాజస్థాన్ జట్టులో చోటు కల్పించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. కాగా, ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడిన మొదటి మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది.