
హైదరాబాద్: ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కేకేఆర్ నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించి విజయం సాధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మరోవైపు కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం విశేషం. ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు రహానే (34), సంజు శాంసన్ (22) చక్కటి శుభారంభం ఇచ్చారు. జట్టు స్కోరు 53 పరుగుల వద్ద రహానే సునీల్ నరేన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
ఆ తర్వాత కొద్ది సేపటికే సంజూ శాంసన్ కూడా పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 57 పరుగులకే రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్(2), బెన్‌స్టోక్స్ (11) వెంట వెంటనే ఔట్ కావడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ 31 బంతుల్లో 47 (5ఫోర్లు, 2సిక్సులు) స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు.
చివర్లో జోఫ్రా ఆర్చర్‌తో కలిసి రన్‌రేట్‌ను అదుపులోకి తీసుకొచ్చాడు. జట్టు స్కోరు 167 పరుగుల వద్ద హిట్‌వికెట్ రూపంలో రేయాన్ పరాగ్ వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి చివర్లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా జోఫ్రా 10 బంతుల్లో 17(ఫోర్, సిక్స్) బాది విజయాన్ని అందించాడు.
రాజస్థాన్ విజయ లక్ష్యం 176
అంతకముందు కెప్టెన్ దినేశ్ కార్తీక్ 50 బంతుల్లో 97(7 ఫోర్లు, 9 సిక్సులు)తో సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌కు 176 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగింది.
ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ క్రిస్ లిన్ వికెట్ కోల్పోయింది. వరుణ్ ఆరోన్ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికి క్రిస్ లిన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వరుణ్ ఆరోన్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి శుభ్‌మాన్ గిల్(14) కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌కతా 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో 50 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సులతో 97 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ అరోన్ రెండు వికెట్లు తీయగా, థామస్, శ్రేయస్ గోపాల్, ఉనాద్కత్‌లకు తలో వికెట్ లభించింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
అంతకముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కరియప్ప, గర్నేల స్థానంలో ప్రశిద్ధ్ కృష్ణ, కార్లోస్ బ్రాత్‌వైట్‌లను జట్టులోకి తీసుకుంది. మరోవైపు రాజస్థాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆస్టన్ టర్నర్, ధావల్ కులకర్ణీల స్థానంలో ఓషెన్ థామస్, వరుణ్ అరోణ్‌లను జట్టులోకి తీసుకుంది.